– ఎస్‌బిఐ ఛైర్మన్ దినేస్ ఖరా అంచనా
ముంబయి : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో రుణాల జారీలో 14-15 శాతం వృద్థిని అంచనా వేస్తున్నామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ఛైర్మన్ దినేష్ కుమార్ ఖరా అన్నారు. ”సాధారణంగా మనం జిడిపి వృద్థి రేటు, ద్రవ్యోల్బణం, దాని కంటే 2-3 శాతం అదనంతో కలుపుకుంటే 14 శాతం లేదా అంతకంటే ఎక్కువ సంఖ్య ఉంటుంది. ఈ నేపథ్యంలోనే 14-15 శాతం రుణాల్లో వృద్థి అందుబాటులో ఉన్న అవకాశాలను సూచిస్తుంది. ఇది మా అవసరాలను తీర్చనుంది. ఈ స్థాయి వృద్థి సంతోషాన్ని ఇస్తుంది.” అని దినేష్ ఖరా తెలిపారు. డిపాజిట్ల విషయానికొస్తే గతేడాది 11 శాతం వృద్థిని సాధించామన్నారు. డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాలని తమపై ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. తమ వద్ద రూ.3.5 లక్షల కోట్ల నుంచి రూ.4 లక్షల కోట్ల వరకు అదనపు చట్టబద్ధమైన ద్రవ్య నిష్పత్తి (ఎస్‌ఎల్‌ఆర్)ను కలిగి ఉన్నామన్నారు. ”మేము ఎల్లప్పుడూ డిపాజిట్లకు ప్రాధాన్యతనిస్తాము. అందుకే మేము ఇటీవల స్వల్పకాలిక డిపాజిట్ల కోసం వడ్డీ రేటును పెంచాము. ఎందుకంటే మెరుగుదల కోసం అవకాశాలు ఉన్నాయని మేము భావించాము. మేము మా డిపాజిట్ వృద్థి రేటును కొంతవరకు మెరుగుపర్చుకోవాలి. ఈ సంవత్సరంలో మేము కనీసం 12-13 శాతం వృద్థిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.” అని దినేష్ ఖరా తెలిపారు. ఎంపిక చేసిన డిపాజిట్లపై గత నెల ఎస్‌బిఐ వడ్డీ రేట్లను 75 బేసిస్ పాయింట్లు మేర పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఎం) గతేడాది స్థాయిలోనే 2-3 బేసిస్ పాయింట్లు పెరగొచ్చని దినేష్ ఖరా అన్నారు. ఎస్‌బిఐ మొండి బాకీల విషయానికి వస్తే.. నికర, స్థూల నిరర్థక ఆస్తుల్లోనూ తగ్గుదల కొనసాగుతోందన్నారు. అయినప్పటికీ.. సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ పనితీరును అంచనా వేయలేము కాబట్టి.. ఎన్‌పిఎల భవిష్యత్తును అంచనా వేయలేమన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి ఎస్‌బిఐ స్థూల నిరర్థక ఆస్తులు 54 బేసిస్ పాయింట్లు మెరుగై.. 2.24 శాతానికి, నికర ఎన్‌పిఎలు 10 బేసిస్ పాయింట్లు మెరుగుపడి 0.57 శాతానికి పరిమితమయ్యాయి.