గ్రామపంచాయతీ కార్మికులకు రూ.15,600 వేతనాలు ఇవ్వాలి

– సీఐటీయూ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్‌
నవతెలంగాణ-చేవెళ్ల
గ్రామపంచాయతీ కార్మికులకు జీవో నెంబర్‌ 60 ప్రకారం రూ.15,600 జీతం ఇవ్వాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్‌ అన్నారు. సోమవారం చేవెళ్ల మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ర్యాలీగా చేవెళ్ల డివిజన్‌ ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని, కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారనీ 51 జీవో ప్రకారం రూ.8,500 జీతం ఇవ్వడం అన్యాయమని అన్నారు. గత 12 ఏండ్ల జనాభా లెక్కల ప్రకారం గ్రామపంచాయతీ కార్మికులకు జీతాలు ఇవ్వడం వారి పొట్ట కొట్టడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క గ్రామ పంచాయతీ కార్మికులకు 30 శాతం పీఆర్సీ కూడా ప్రకటించకపోవడం సరైంది కాదన్నారు. గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం జీవో నెంబర్‌ 60 ప్రకారం 15,600 ఇవ్వాలనీ రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పించి,గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేనియేడలా వచ్చే జూన్‌ మాసంలో సమ్మె చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ యూనియన్‌ చేవెళ్ల మండలాధ్యక్షులు నర్సింలు, షాబాద్‌ మండల నాయకులు నరసింహ, భీమయ్య, నర్సింలు, శ్రీను, మురళి, రవి, స్వరూప, అడువమ్మ, మల్లమ్మ, దస్తగిరి, నరసింహ,గ్రామపంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.