18న సరికొత్త కూచిపూడి నృత్య నాటిక ఆముక్తమాల్యద

నవతెలంగాణ-హిమాయత్‌నగర్‌
ఈ నెల 18వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు లక్డీకాపూల్‌, రవీంద్రభారతిలో అభినయవాణి నృత్య నికేతన్‌, రిందా శరణ్య సంయుక్త ఆధ్వర్యంలో ‘సరికొత్త కూచిపూడి నృత్య నాటిక ఆముక్తమాల్యద’ను ప్రదర్శించనున్నట్టు ప్రముఖ నాట్య గురువు డాక్టర్‌ యశోద ఠాకూర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు 500 ఏండ్ల క్రితం కృష్ణదేవరాయలు విరచించిన పంచ మహా కావ్యాల్లో ఒకటైన ఆముక్తమాల్యద ప్రత్యేకమైన మత, రాజకీయ ఇతివృత్తాలను తెలియజేస్తుందన్నారు. ఆముక్తమాల్యద ఒక ఉన్నత శ్రేణి తెలుగు గ్రంథం అనీ, దాని ప్రధాన కథనంలో ఇమిడి ఉన్న కథ ‘ఆండాళ్‌’ ఈ గొప్ప సాహిత్య సౌందర్యాన్ని ప్రదర్శన, కళారూపంలో ఈ నృత్య నాటకం ప్రదర్శిస్తుందన్నారు. తెలుగు నెలకు చెందిన గొప్ప సాహిత్య, సాంస్కతిక వారసత్వంలో మునిగిపోవడానికి, మన ప్రతిభవంతులైన కళాకారుల మనోహరమైన ప్రదర్శనను చూడటానికి అందరిని తాము ఆహ్వానిస్తున్నట్టు ఆయన తెలిపారు.