పీఎం కిసాన్‌కు 2.34 కోట్ల మంది రైతులు దూరం

– పార్లమెంటులో ప్రశ్నలు..సమాధానాలు
– కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
     కేవలం నాలుగు నెలల్లోనే 2,34,59,262 మంది రైతులు పీఎం కిసాన్‌కు దూరమయ్యారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ తెలిపారు. రాజ్యసభ ఆర్జేడీ ఎంపీ మనోజ్‌ కుమార్‌ ఝా అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2022-23లో ఏప్రిల్‌-జులైలో 10,45, 68, 304 మంది రైతులు పీఎం కిసాన్‌ లబ్దిదా రులు కాగా, ఆ సంఖ్య 2022-23 డిసెంబర్‌-మార్చి నాటికి 8,11,09,042తు తగ్గిందని తెలిపారు. అంటే నాలుగు నెలల్లో 2,34,59,262 మంది రైతులు పీఎం కిసాన్‌ పథకానికి నోచుకోలేదని అన్నారు.
మెడికల్‌ కోర్సులకు కేంద్రీకృత కౌనెల్సింగ్‌ ప్రాతిపాదన లేదు
మెడికల్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులకు కంద్రీకృత కౌనెల్సింగ్‌ నిర్వహించే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మనస్సుఖ్‌ మాండవీయ తెలిపారు. చేవెళ్ల, మహబూబాబాద్‌ ఎంపిలు డాక్టర్‌ గడ్డు రంజిత్‌ రెడ్డి, మాలోత్‌ కవిత అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. వివిధ కోటాల కింద సీట్ల కేటాయించే విధానంలోనూ మార్పు లేదని మంత్రి పేర్కొన్నారు. అండర్‌ గ్రాడ్యూయేట్స్‌ కోర్సుల్లో కేవలం 15 శాతం సీట్లు మాత్రమే అఖిల భారత కోటాలో ఉంటాయని కేంద్ర మంత్రి వెల్లడించారు.
ఎయిమ్స్‌ పేర్లు మార్చే ప్రతిపాదన లేదు.
ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని 20 ఎయిమ్స్‌ పేర్లు మార్చే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మనసుఖ్‌ మాండవీయ తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధులు, స్థానిక యోధుల పేర్లను ఎయిమ్స్‌ కు కేంద్ర ప్రభుత్వం పెట్టాలనుకునేది నిజమేనా అని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి శుక్రవారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
2018 నుంచి ఈ ఏడాది జులై 23 వరకు దేశ వ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో 604 మంది న్యాయమూర్తు లను నియమించగా అందులో 158 మంది జనరల్‌ కేటగిరి, 72 మంది ఓబీసీ, 18 మంది ఎస్‌సీ, 9 మంది ఎస్‌టీ, 34 మంది మైనారిటీ వర్గానికి చెందిన వారని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ తెలిపారు. మరో 13 మంది న్యాయమూర్తులు తమ వివరాలు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాదానమిచ్చారు. రాజ్యాంగంలోని 124, 127, 224 ఆర్టికల్స్‌ ప్రకారం హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో ఏ వర్గానికి, కులానికి రిజర్వేషన్లు కల్పించలేదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 2020 నుంచి ఈ ఏడాది జులై 15 వరకు సుప్రీంకోర్టు 1,07,651 కేసులు విచారణను ముగించిందని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు 96,7500, తెలంగాణ హైకోర్టు 1,12,280 కేసుల విచారణను ముగించిందని కేంద్ర మంత్రి వెల్లడించారు.
2018-2023 వరకు ఆంధ్రప్రదేశ్‌లో 6,502 మంది పిల్లలు అదృశ్యం కాగా, అందులో 4,682 మంది పట్టు బడ్డారని, తెలంగాణలో 1,591 మంది తప్పిపోగా, 1,243 మందిని పట్టుకోగలిగామని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
తెలంగాణలో 8,540 మెడిసిన్‌ సీట్లు, ఏపీలో 6,435
మెడిసిన్‌ సీట్లు తెలంగాణలో 8,540, ఆంధ్రప్రదేశ్‌లో 6,435 ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్‌ పవర్‌ తెలిపారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తెలంగాణలో 28 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 3,890 సీట్లు, 28 ప్రయివేట్‌ కాలేజీల్లో 4,650 సీట్లు ఉన్నాయని, ఏపీలో 18 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 3,235 సీట్లు, 19 ప్రయివేట్‌ కాలేజీల్లో 3,200 సీట్లు ఉన్నాయని తెలిపారు.
ఏపీ హైకోర్టు తరలింపు అంశం.. కేంద్రం వద్ద పెండింగ్‌లో లేదు
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తరలింపు అంశం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో లేదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ తెలిపారు. శుక్రవారం లోక్‌సభలో ఎంపీ తలారి రంగయ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తరలింపు పూర్తిస్థాయి ప్రతిపాదనేదీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో లేదని తెలిపారు. హైకోర్టు తరలింపు గురించి రాష్ట్ర ప్రభుత్వం, అక్కడి హైకోర్టు చర్చించి నిర్ణయం తీసుకోవాలని, అందుకు సంబంధించిన పూర్తి స్థాయి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని అన్నారు.