నవతెలంగాణ-గణపురం
బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి 20 ఏండ్లు జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ పొక్సో స్పెషల్ జడ్జి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నారాయణ బాబు సోమవారం తీర్పు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన యువకుడు కీర్తి నరేష్, మండలంలోని మరో గ్రామానికి చెందిన బాలికపై 1-9-2022న లైంగికదాడి, అసభ్యకరంగా ప్రవర్తిస్తూ సెల్ఫీ ఫొటోలు దిగి, బ్లాక్ మెయిల్ చేసి, చాటింగ్ చేయాలని వేధించాడు. లేదంటే ఫొటోలను యూట్యూబ్, వాట్సాప్‌లో పెడతానని భయభ్రాంతులకు గురి చేసి బాలికను శరీరకంగా హింసించాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్‌ఐ అభినవ్ కేసు నమోదు చేసి నరేష్‌ను రిమాండ్‌కు తరలించారు. అనంతరం అప్పటి చిట్యాల సీఐ పులి వెంకట్ పూర్తిస్థాయిలో విచారణ జరిపి కోర్టులో ఆధారాలు సమర్పించారు. ఈ కేసులో వాదనలు విన్న పొక్సో స్పెషల్ జడ్జి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి నారాయణ బాబు తీర్పు వెలువరించారు. వాదనలు వినిపించిన పీపీ విష్ణువర్ధన్ రావు, సాక్షులను బ్రీఫ్ చేసిన చిట్యాల సీఐ వేణు చందర్, గణపురం ఎస్‌ఐ సాంబమూర్తి, సాక్షులను కోర్టులో హాజరు పరిచిన కోర్టు కానిస్టేబుల్ శ్వేతను జిల్లా ఎస్పీ కిరణ్ కారే అభినందించారు. మహిళలపై నేరాలకు పాల్పడితే చట్టపరంగా శిక్ష తప్పదని హెచ్చరించారు.