2023లో 2003 రిపీట్‌

2023లో 2003 రిపీట్‌ఈసారి ప్రపంచకప్‌ వేట మునుపటి లెక్క ఉండదు. ఇదీ మెగా ఫైట్‌ ముంగిట టీమ్‌ ఇండియా మాట. ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌ ఎవరూ ఎటువంటి పొరపాటు చేయని రోహిత్‌సేన.. బలహీనతే లేని జట్టుగా ఫైనల్లోకి అడుగుపెట్టింది. 2003 ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌ ఒత్తిడికి లోనై టైటిల్‌ను ఆస్ట్రేలియాకు కోల్పోయింది. 2023 ఫైనల్లో మనోళ్లు ఒత్తిడికి గురి చేస్తారే కానీ ఒత్తిడి ట్రాప్‌లో పడరు అనే బలమైన నమ్మకం అహ్మదాబాద్‌లో గాలి బుడగలా పేలింది. 2003 ఫైనల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా.. రికీ పాంటింగ్‌ (140 నాటౌట్‌), డామిన్‌ మార్టిన్‌ (88 నాటౌట్‌) ఇన్నింగ్స్‌లతో భారీ స్కోరు నమోదు చేసింది. ఛేదనలో గంగూలీ సేనపై ఒత్తిడి పెంచింది. ఆ పని టీమ్‌ ఇండియా ఆదివారం చేయలేదు. స్లో పిచ్‌పై తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 240 పరుగులే చేసింది. సెమీస్‌ సహా గ్రూప్‌ దశలో సవాల్‌తో కూడిన లక్ష్యాలను ఛేదించిన అనుభవం ఆస్ట్రేలియా సొంతం. టైటిల్‌ పోరులో ఈ సవాల్‌ ఆసీస్‌కు కొత్త కాదు. అందుకే ఆరంభంలోనే 3 వికెట్లు పడినా.. డ్యాషింగ్‌ ఓపెనర్‌ ట్రావిశ్‌ హెడ్‌ దూకుడు ట్రాక్‌ వీడలేదు. మిడిల్‌ ఓవర్లలో బౌండరీలతో దండెత్తాడు. భారత బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. ప్రపంచకప్‌ను మళ్లీ ఆస్ట్రేలియాకు తీసుకెళ్లాడు. 2003 పరాజయానికి 2023లో ప్రతీకారం తీర్చుకోవాలని ఆశించిన టీమ్‌ ఇండియా.. మళ్లీ భంగపడింది. ప్రపంచకప్‌ టైటిల్‌ ముంగిట ఆఖరు మెట్టుపై చతికిల పడింది. వందకోట్ల భారత అభిమానులకు తీరన వేదన మిగిల్చింది.