ఫైనల్లో భారత్‌

India in the final– ఉత్కంఠ సెమీస్‌లో కివీస్‌పై గెలుపు
– కోహ్లి, శ్రేయస్‌ సెంచరీలు.. షమి జోరు
– భారత్‌ 397/4, న్యూజిలాండ్‌ 327/10
ప్రపంచకప్‌ నాకౌట్లో న్యూజిలాండ్‌ అడ్డు తొలగింది. పరుగుల వరద పారిన వాంఖడెలో కివీస్‌పై ఉత్కంఠ విజయం సాధించిన ఆతిథ్య భారత్‌ ప్రపంచకప్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. కోహ్లి (117), శ్రేయస్‌ (105), గిల్‌ (80) మెరుపులతో తొలుత భారత్‌ 397 పరుగుల భారీ స్కోరు చేసింది. మహ్మద్‌ షమి (7/57) స్వింగ్‌ తుఫాన్‌తో ఛేదనలో కివీస్‌ను చావుదెబ్బ కొట్టాడు. 70 పరుగుల తేడాతో కివీస్‌పై గెలుపొందిన భారత్‌ ఆదివారం అహ్మదాబాద్‌లో టైటిల్‌ పోరుకు సిద్ధమైంది.
నవతెలంగాణ-ముంబయి
ప్రపంచకప్‌ ఫైనల్లో టీమ్‌ ఇండియా అడుగుపెట్టింది. ముంబయిలో బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన టీమ్‌ ఇండియా 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 398 పరుగుల ఛేదనలో న్యూజిలాండ్‌ పోరాడినా ఫలితం లేకపోయింది. డార్లీ మిచెల్‌ (134, 119 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్‌లు), కేన్‌ విలియమ్సన్‌ (69, 73 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌) మూడో వికెట్‌కు 181 పరుగుల భాగస్వామ్యంతో కివీస్‌ను రేసులో నిలిపారు. కానీ మహ్మద్‌ షమి ఐదు వికెట్ల ప్రదర్శన కివీస్‌ను కోలుకోనివ్వలేదు. 48.5 ఓవర్లలో కివీస్‌ 327 పరుగులే చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 50 ఓవర్లలో 4 వికెట్లకు 397 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లి (117, 113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయస్‌ అయ్యర్‌ (105, 70 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లు) శతకాలతో చెలరేగగా.. శుభ్‌మన్‌ గిల్‌ (80, 66 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), రోహిత్‌ శర్మ (47), కెఎల్‌ రాహుల్‌ (39) రాణించారు.
ధనాధన్‌ ధమాకా : టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 50 ఓవర్లలో 397 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (47, 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) పవర్‌ప్లేలో కివీస్‌ పేసర్లపై పంజా విసిరాడు. రోహిత్‌ దూకుడుతో భారత్‌ తొలి వికెట్‌కు 50 బంతుల్లోనే 71 పరుగులు చేసింది. రోహిత్‌ నిష్క్రమణతో గిల్‌ (80) జోరందుకోగా.. విరాట్‌ కోహ్లి (117) స్ట్రయిక్‌రొటేట్‌ చేశాడు. మిడిల్‌ ఓవర్లలో కివీస్‌ బౌలర్లతో ఆడుకున్న ఈ జోడీ86 బంతుల్లో 93 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. కండరాల నొప్పితో గిల్‌ క్రీజు వీడగా.. శ్రేయస్‌ అయ్యర్‌ (105) ధమాకా మొదలైంది. 35 బంతుల్లో అర్థ సెంచరీ బాదిన శ్రేయస్‌.. మూడు ఫోర్లు, 8 సిక్సర్లతో 67 బంతుల్లోనే శతకం సాధించాడు. కోహ్లితో కలిసి 128 బంతుల్లో 163 పరుగులు జతచేసిన అయ్యర్‌ భారత్‌కు భారీ స్కోరు ఖాయం చేశాడు. చారిత్రక శతకం అనంతరం కోహ్లి నిష్క్రమించినా.. కెఎల్‌ రాహుల్‌ (39 నాటౌట్‌, 20 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్‌ ముగింపు ఇచ్చాడు. ఆరంభంలో రోహిత్‌, చివర్లో శ్రేయస్‌, రాహుల్‌ దూకుడు భారత్‌ను ముందంజలో నిలిపింది. చివరి పది ఓవర్లలో 110 పరుగులు పిండుకున్న భారత్‌ 397 పరుగులు చేసింది.
స్కోరు వివరాలు
భారత్‌ ఇన్నింగ్స్‌ : రోహిత్‌ (సి) కేన్‌ (బి) సౌథీ 47, గిల్‌ నాటౌట్‌ 80, కోహ్లి (సి) కాన్వే (బి) సౌథీ 117, శ్రేయస్‌ (సి) మిచెల్‌ (బి) బౌల్ట్‌ 105, రాహుల్‌ నాటౌట్‌ 39, సూర్య (సి) ఫిలిప్స్‌ (బి) సౌథీ 1, ఎక్స్‌ట్రాలు : 8, మొత్తం : (50 ఓవర్లలో 4 వికెట్లకు) 397.
బౌలింగ్‌ : బౌల్ట్‌ 10-0-86-1, సౌథీ 10-0-100-3, శాంట్నర్‌ 10-1-51-0, ఫెర్గుసన్‌ 8-0-65-0, రచిన్‌ 7-0-60-0, ఫిలిప్స్‌ 5-0-33-0.
న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ : కాన్వే (సి) రాహుల్‌ (బి) షమి 13, రచిన్‌ (సి) రాహుల్‌ (బి) షమి 13, విలియమ్సన్‌ (సి) సూర్య (బి) షమి 69, మిచెల్‌ (సి) జడేజా (బి) షమి 134 , లేథమ్‌ (ఎల్బీ) షమి 0, ఫిలిప్స్‌ (సి) జడేజా (బి) బుమ్రా 41, చాప్‌మాన్‌ (సి) జడేజా (బి) కుల్దీప్‌ 2, శాంట్నర్‌ (సి) రోహిత్‌ (బి) సిరాజ్‌ 8, సౌథీ (సి) రాహుల్‌ (బి) షమి 2, బౌల్ట్‌ నాటౌట్‌ 2, ఫెర్గుసన్‌ (సి) రాహుల్‌ (బి) షమి 6, ఎక్స్‌ట్రాలు : 30, మొత్తం : (48.5 ఓవర్లలో ఆలౌట్‌) 327.
బౌలింగ్‌ : బుమ్రా 10-1-64-1, సిరాజ్‌ 9-0-78-1, షమి 9.5-0-78-7, జడేజా 10-0-63-0, కుల్దీప్‌ 10-0-55-1.

Spread the love