21 కొత్త మెడికల్‌ కాలేజీలు

– దసరా నాటికి వరంగల్‌ హెల్త్‌ సిటీ
– కేసీఆర్‌ కిట్‌తో గణనీయంగా తగ్గిన మాతా, శిశు మరణాలు
– ప్రభుత్వాస్పత్రుల్లో 70 శాతానికి పెరిగిన ప్రసవాలు
– 57 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు ఉచితం
– నిమ్స్‌ విస్తరణకు నేడు సీఎం శంకుస్థాపన
– ‘దశాబ్ది’లో నేడు వైద్యారోగ్యశాఖ దినోత్సవం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం వైద్యారోగ్యశాఖ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. నిటిఅయోగ్‌ 2021 ఇండెక్స్‌ ప్రకారం…. వైద్యరంగంలో కేరళ, తమిళనాడు తర్వాత తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. తద్వారా రాష్ట్రం వైద్యారోగ్యశాఖ పనితీరును బేరీజు వేసే పలు కొలమానాల్లో అగ్రభాగంలో, ముందువరసలోకి ఎగబాకింది. ప్రభుత్వం 2015-16లో వైద్యారోగ్య శాఖకు రూ.4,932 కోట్లు కేటాయించగా.. 2023-24 నాటికి ఆ కేటాయింపుల రూ.12,364 కోట్లకు పెరిగింది. జిల్లాకో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా ఇప్పటికే 21 కొత్త మెడికల్‌ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య 8,340కు పెరగగా, ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్‌ సీట్లతో దేశంలోనే తెలంగాణ అగ్రభాగంలో నిలిచింది. ప్రతి లక్ష జనాభాకు 7.5 పీజీ సీట్లతో రెండో స్థానం కైవసం చేసుకుంది.
వరంగల్‌ జిల్లాలో తలపెట్టిన హెల్త్‌ సిటీ పనులు ముగింపు దశలో ఉండగా దసరా నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గచ్చిబౌలిలో టిమ్స్‌ ఏర్పాటు చేయగా, కొత్తగా అల్వాల్‌, ఎల్బీనగర్‌, సనత్‌నగర్‌లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తున్నారు. నిమ్స్‌లో రెండు వేల పడకలతో కొత్త భవనానికి బుధవారం సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. గాంధీ ఆస్పత్రిలో సూపర్‌ స్పెషాలిటీ, మాతా, శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్‌) పనులు చివరి దశలో ఉన్నాయి. ఇవి పూర్తయితే మరో 10 వేల సూపర్‌ స్పెషాలిటీ పడకలు అందుబాటులోకి వస్తాయి. 2014కు ముందు ఆస్పత్రులన్నింటిలో కలిపి 17 వేల పడకలుండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 34 వేలకు పెరిగింది.
తగ్గిన మాతృ…శిశు మరణాల రేటు….
రాష్ట్రంలో 2014కు ముందు మాతృ మరణాల రేటు 92 కాగా, ప్రస్తుతం 43కు తగ్గింది. శిశు మరణాల రేటును 39 నుంచి 29కు తగ్గించగలిగారు. కేసీఆర్‌ కిట్‌ ఇస్తున్న ప్రోత్సాహకం …. గర్భిణులు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడానికి దోహదపడింది. రిస్క్‌ ఉన్న వారిని గుర్తించి ముందే జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మరణాల సంఖ్య తగ్గింది. అమ్మఒడి వాహనాల ద్వారా ఇంటి నుంచి ఆస్పత్రికి, ఆస్పత్రి నుంచి ఇంటికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించడంతో ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగి వాటి సంఖ్య 30 శాతం నుంచి 70 శాతానికి చేరుకుంది. మరోవైపు సిజేరియన్‌ ఆపరేషన్ల సమస్యను అధిగమించేందుకు సహజ ప్రసవాలు చేసే వారికి ప్రోత్సాహం అందిస్తున్నారు. దీంతో సి సెక్షన్లను తగ్గించాలన్న లక్ష్యం దిశగా ప్రభుత్వం పయనిస్తోంది. గర్బిణులు రక్తహీనత సమస్యను అధిగమించేందుకు వీలుగా కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ పథకాన్ని అమలు చేస్తున్నారు. రోగులకు, పౌష్టికాహారం అందించేందుకు డైట్‌ ఛార్జీలను ప్రభుత్వం రెట్టింపు చేసింది. రోగుల సహాయకులకు రూ.5కే మూడు పూటల భోజనం అందించే కార్యక్రమంతో పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 400 బస్తీ దవాఖానాలు సేవలందిస్తున్నాయి. వీటి ద్వారా ప్రతి ఏడాది 50 లక్షల మంది రోగులు వైద్య సేవలు పొందుతున్నారు. వీటి ఏర్పాటు తర్వాత బోధనాస్పత్రులు, ఇతర ఆస్పత్రులపై ప్రాథమిక వైద్యం కోసం వచ్చే రద్దీ భారం తగ్గింది. అసాంక్రమిత వ్యాధుల (నాన్‌ కమ్యూనికేబుల్‌ డిసీజెస్‌) నిర్దారణ కోసం గతేడాది 1.48 కోట్ల మందికి స్క్రీనింగ్‌ నిర్వహించగా, వారిలో 17.36 లక్షల మందికి బీపీ, 8.86 లక్షల మందిలో మధుమేహం ఉన్నట్టు గుర్తించారు. దీంతో వారికి సకాలంలో వైద్యమందించించగలిగారు. జిల్లా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ (సీహెచ్‌సీ)ల్లో ప్రత్యేక ఎన్సీడీ క్లినిక్‌లతో పాటు క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా పరికరాలను అందుబాటులోకి తెచ్చింది. గతంలో పెద్దాస్పత్రుల్లో వైద్య పరికరాల మరమ్మత్తు పెద్ద సమస్యగా ఉండేది. దాన్ని అధిగమించేందుకు రాష్ట్రవ్యాప్తంగా నిరంతర పర్యవేక్షణ కోసం పరికరాల ‘ఎక్విప్‌మెంట్‌ మెయిటెనెన్స్‌ ప్రోగ్రాం’ను అమలు చేస్తున్నది. 887 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో లైవ్‌ సీసీటీవీ కెమెరాల ద్వారా ఆయా విభాగాల అధికారులతో పాటు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి వరకు ప్రతి నిత్యం పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. మహిళలు ఎదుర్కొంటున్న ఎనిమిది రోగాలకు సంబంధించి ప్రతి మంగళవారం ప్రత్యేక స్క్రీనింగ్‌తో ప్రారంభంలోనే గుర్తిస్తూ వైద్యమందిస్తున్నారు. 2014కు మందు మూడు మాత్రమే ఉన్న డయాలసిస్‌ సెంటర్ల సంఖ్యను ఇప్పుడు 102కు పెంచారు.
నిమ్స్‌ విస్తరణ పనులకు…నేడు సీఎం శంకుస్థాపన
నిమ్స్‌ నూతన భవనానికి బుధవారం ఉదయం 10 గంటలకు సీఎం కేసీఆర్‌ భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేయనున్నారు. దశాబ్ది బ్లాక్‌గా దీన్ని పేర్కొంటున్న ఈ బ్లాక్‌ శంకుస్థాపన కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొననున్నారు.ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. వైద్యారోగ్యశాఖ దినోత్సవంలో భాగంగా ఆ శాఖ అందిస్తున్న సేవలపై ప్రజల్లో అవగరాహన కల్పించే కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్నారు.