బీహార్‌లో 22 మంది జలసమాధి

22 drowned in Bihar– 24 గంటల్లో ఐదు పడవ ప్రమాదాలు
పాట్నా : బీహార్‌లో 24 గంటల వ్యవధిలో వేర్వేరు చోట్ల జరిగిన ఐదు పడవ ప్రమాదాల్లో 22 మంది జలసమాధి అయ్యారు. బీహార్‌ ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం భోజ్‌పూర్‌ పడవ ప్రమాదంలో ఐదుగురు, జహనబాద్‌లో నలుగురు, పాట్నా, రోహతాస్‌ల్లో ముగ్గురేసి, దర్భాంగ, నవాడా ప్రమాదాల్లో ఇద్దరేసి మరణించారు. మధేపుర, కైమూర్‌, ఔరంగబాద్‌ జిల్లాల్లో పడవ ప్రమాదాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. ఈ ప్రమాదాలపై ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతులపై ఆధారపడిన కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు.
ఢిల్లీలో మరో ఇద్దరు మృతి
ఢిల్లీలోని న్యూ ఉస్మాన్‌పూర్‌కు చెందిన యమునా ఖదర్‌్‌ ప్రాంతంలో నదిలో మునిగి ఇద్దరు అన్నదమ్ములు మరణించారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని వీరిని జెపిసి ఆసుపత్రికి తరలించారు. అప్పటికీ ఇద్దరూ మరణించారని వైద్యులు తెలిపారు. మృతుల్ని ఢిల్లీలోని గమ్రి గ్రామంలోని పుస్తా ప్రాంతానికి చెందిన కవల సోదరులుగా గుర్తించారు.