– ఎంసీఏలో సీట్లు 3,042
– ఐసెట్ కౌన్సెలింగ్‌లో 16,716 మంది ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు
– నేటినుంచి ధ్రువపత్రాల పరిశీలన, ఆప్షన్ల నమోదు షురూ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కోసం ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. అయితే 245 కాలేజీల్లో 22,843 ఎంబీఏ సీట్లు, 47 కాలేజీల్లో 3,042 ఎంసీఏ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆ సీట్లన్నీ కన్వీనర్ కోటాలోనే ఉండడం గమనార్హం. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఐసెట్ ప్రవేశాల కన్వీనర్ వాకాటి కరుణ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 11 వరకు ఆన్‌లైన్‌లో సమాచారం అందుబాటులో ఉంచడంతోపాటు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించేందుకు అవకాశముంటుందని తెలిపారు. ఇప్పటి వరకు 16,716 మంది అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుక్ చేసుకున్నారని పేర్కొన్నారు. శుక్రవారం నుంచి ధ్రువపత్రాల పరిశీలన, వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమవుతాయని వివరించారు. ఈనెల 12 వరకు ధ్రువపత్రాల పరిశీలన, 13 వరకు వెబ్‌ఆప్షన్ల నమోదు చేసేందుకు గడువుందని తెలిపారు. 17న ఐసెట్ తొలివిడత కౌన్సెలింగ్ ద్వారా సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ష్ట్ర్‌్‌జూర://్‌రఱషవ్.అఱష.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.