సూడాన్‌లో 24గంటలు కాల్పుల విరమణ

ఖరియాద్‌ : శనివారం నుండి 24గంటల పాటు కాల్పుల విరమణకు సూడాన్‌ ప్రత్యర్ధి పక్షాలు అంగీకరించాయి. ఈ మేరకు అమెరికా, సౌదీ మధ్యవర్తులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా కాల్పులను విరమించేందుకు సూడాన్‌ సాయుధ బలగాలు (ఎస్‌ఎఎఫ్‌), రాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్సెస్‌ (ఆర్‌ఎస్‌ఎఫ్‌) ప్రతినిధుల మధ్య అంగీకారం కుదిరింది. శనివారం ఉదయం ఆరు గంటల నుండి ఈ ఒప్పందం అమలవుతుందని సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఆ ప్రకటన పేర్కొంది. గతంలో అనేక సార్లు కాల్పుల విరమణ ఒప్పందాలు కుదిరాయి, విఫలమయ్యాయి. గతంలో విఫలమైన ఒప్పందాలకు కూడా వీరే మధ్యవర్తిత్వం వహించారు. ఉభయ పక్షాలకు చెందిన జనరల్స్‌పై అమెరికా ఆంక్షలు కూడా విధించింది. భయంకరమైన రక్తపాతానికి ఇరు పక్షాలు కారణమని విమర్శించింది. ఈ 24గంటల కాల్పుల విరమణను కూడా పాటించలేకపోతే సౌదీ రాజధాని జెడ్డాలో జరుగుతున్న చర్చలను వాయిదా వేసే ఆలోచన చేయాల్సి వస్తుందని మధ్యవర్తులు హెచ్చరించారు. గత నెల చివరి నుండి ఈ చర్చలు నిలిచిపోతూ వస్తున్నాయి. ఏప్రిల్‌ నుండి ఈ పోరు కొనసాగుతోంది. ప్రధానంగా రాజధాని ఖార్టూమ్‌లో, పశ్చిమ డార్ఫర్‌ ప్రాంతంలో ఘర్షణలు విస్తృతంగా చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు 1800మంది చనిపోయారని, 20లక్షల మంది నిర్వాసితులయాయరని ఐక్యరాజ్య సమితి పేర్కొంది.