వలసలపై కుదరని ఏకాభిప్రాయం !

–  కుప్పకూలిన డచ్‌ ప్రభుత్వం ప్రధాని రాజీనామా
ది హేగ్‌ : డచ్‌ ప్రభుత్వం శుక్రవారం కుప్పకూలిపోయింది. వలసలను ఎలా అరికట్టాలనే అంశంపై నాలుగు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఏకాభిప్రాయానికి రాలేకపోవడంతో నెదర్లాండ్స్‌ ప్రధాని మార్క్‌ రూటె తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ ఏడాది చివరిలో ఎన్నికలు నిర్వహించడానికి మార్గం సుగమమైందని భావిస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకు రూటె ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వంగా వ్యవహరిస్తుంది. ”వలస విధానాలపై సంకీర్ణ భాగస్వాముల మద్య భిన్నమైన అభిప్రాయాలు వున్నాయి. ఇందులో రహస్యమేమీ లేదు’ అని రూటె విలేకర్లతో వ్యాఖ్యానించారు.
తమ మధ్య విభేదాలను పరిష్కరించుకోలేమని నిర్ధారణకు రావడంతో దురదృష్టవశాత్తూ ఈ నిర్ణయానికి రావాల్సి వచ్చిందని అన్నారు. అందువల్లే మంత్రివర్గం రాజీనామా లేఖను రాజుకు రాతపూర్వకంగా అందచేశానని చెప్పారు. ఈలోగా తాజాగా ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష పార్టీలు పిలుపిచ్చాయి. తక్షణమే ఎన్నికల జరగాలని యాంటీ ఇమ్మిగ్రేషన్‌ పార్టీ ఫర్‌ ఫ్రీడమ్‌ నేత గీర్ట్‌ వైల్డర్స్‌ ట్వీట్‌ చేశారు. గ్రీన్‌ లెఫ్ట్‌ నేత జెస్సీ క్లావెర్‌ కూడా ఎన్నికలకై పిలుపిచ్చారు. ఈ దేశానికి దిశా నిర్దేశం మారాల్సిన అవసరం వుందని వ్యాఖ్యానించారు.
బుధ, గురువారాల్లో వరుసగ అర్ధరాత్రులు వరకు సమావేశమైనా శరణార్ధుల విధానంపై ఒక ఒప్పందానికి రాలేకపోయారు. దాంతో ఇక సంకీర్ణంలో కలిసి వుండలేమని శుక్రవారం ఉదయం జరిగిన సమావేశంలో అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. మార్క్‌ రూటెకి చెందిన పీపుల్స్‌ పార్టీ ఫర్‌ ఫ్రీడమ్‌ అండ్‌ డెమోక్రసీ, క్రిస్టియన్‌ డెమోక్రాట్లు శరణార్ధులపై కఠిన చర్యలు తీసుకునేందుకు మొగ్గు చూపుతుండగా, డి66, క్రిస్టియన్‌ యూనియన్‌లు వ్యతిరేకిస్తున్నాయి.

Spread the love