24,25 తేదీల్లో హైదరాబాద్‌లో వజ్రోత్సవ వేడుకలు

– విద్యారంగ సేవకు ఉపాధ్యాయులు పునరంకితం కావాలి : ఎస్టీయూటీఎస్‌ అధ్యక్షులు సదానందంగౌడ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రోపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్రం (ఎస్టీయూటీఎస్‌) వజ్రోత్సవ వేడుకలను ఈనెల 24, 25 తేదీల్లో హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఉన్న ఎంఈ రెడ్డి గార్డెన్‌లో నిర్వహించనున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి సదానందంగౌడ్‌, ప్రధాన కార్యదర్శి ఎం పర్వత్‌రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి బి భుజంగరావు చెప్పారు. ఈ వేడుకలతో విద్యారంగ సేవకు ఉపాధ్యాయులు పునరంకితవ్వాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు సమరోత్సాహంతో పనిచేయాలని కోరారు. హైదరాబాద్‌లోని ఎస్టీయూటీఎస్‌ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ వేడుకలకు మంత్రులు టి హరీశ్‌ రావు, పి సబితాఇంద్రారెడ్డి, వి శ్రీనివాస్‌గౌడ్‌. ఎ ఇంద్రకరణ్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మహమూద్‌ అలీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, ఎస్టీయూఏపీ ఎమ్మెల్సీ కత్తి నరసింహరెడ్డి, ఎమ్మెల్యే డి సుధీర్‌రెడ్డి హాజరవుతారని వివరించారు. ఈ వజ్రోత్సవాల్లో ఉపాధ్యాయ సమస్యలు, ఇప్పటి వరకు సాధించిన విజయాలు, సాధించాల్సిన హక్కులు తదితర అంశాలపై చర్చిస్తామని చెప్పారు. ఈ వేడుకలు సమస్యలకు పరిష్కారం చూపుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బదిలీలు, పదోన్నతులపైన ప్రభుత్వ నిర్ణయం వెలువడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎస్టీయూ 1946లో ఆవిర్భవించిందని గుర్తు చేశారు. ఆ రకంగా తమ సంఘం స్వాతంత్య్రం రాకముందు నుంచే 1947, జూన్‌ 9 నుంచి అధికారిక సంఘంగా కొనసాగుతుందన్నారు. గతంలో ఎస్టీయూటీఎస్‌ కార్యక్రమాలకు రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌తోపాటు పలువురు ముఖ్యమంత్రులు హాజరయ్యారని వివరించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి బి భుజంగరావు విజయమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూటీఎస్‌ రాష్ట్ర నాయకులు కరుణాకర్‌రెడ్డి, టి పోల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కమీషన్ల కోసమే ఉపాధ్యాయులకు జియోట్యాగింగ్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఎస్టీయూటీఎస్‌ అధ్యక్షులు సదానందంగౌడ్‌ విమర్శించారు. 17 జిల్లాల్లో బయోమెట్రిక్‌ అమలవుతున్నదని చెప్పారు. ఓ ప్రయివేటు సంస్థ జియోట్యాగింగ్‌ను రూపొందిస్తే హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లోని ఉపాధ్యాయులకు అమలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తగదని హెచ్చరించారు. అన్ని శాఖల్లోని ఉద్యోగులకూ ఈ విధానాన్ని వర్తింపచేస్తే తమకు అభ్యంతరం లేదనీ, కేవలం ఉపాధ్యాయులపైనే కక్షసాధింపు చర్యలు ఎందుకని ప్రభుత్వాన్ని అడిగారు. జియోట్యాగింగ్‌ మంచిదేనంటూ సిట్టింగ్‌ ఎమ్మెల్సీ జనార్ధన్‌రెడ్డి చెప్పడం సరైంది కాదని ఎస్టీయూటీఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి భుజంగరావు విమర్శించారు.