– ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి
– డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
చట్టసభల్లో మహిళలకు కల్పించిన 33శాతం రిజర్వేషన్లలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్‌పీ) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్.ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. కేంద్రం ప్రవేశపెట్టిన మహిళా బిల్లును స్వాగతిస్తున్నట్టు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో లబ్ధిపొందడం కోసమే బీజేపీ 33శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టిందన్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లను జనాభా ప్రాతిపదికన 50 శాతానికి పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళిత ఐఏఎస్ అధికారి జి.కృష్ణయ్యను హత్య చేసిన ఆనంద్ మోహన్ శిక్షను తగ్గించి జైలు నుంచి ఎందుకు విడుదల చేశారో ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, ఇండియా కూటమిలో ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈడీ కేసులను తప్పించుకోవడం కోసమే కవిత మహిళా బిల్లు కోసం ధర్నా చేసిందని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌లో మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంఖ్య కేవలం ఆరుగురు ఆధిపత్య వర్గాలకు చెందిన వారేనన్నారు. నిజంగా కవితకు చిత్తశుద్ధి ఉంటే బీఆర్‌ఎస్‌లో మహిళకు రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు పథకాలు అమలకు ఆచరణ సాధ్యం కావని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఒరిగిందేమీలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న పార్టుటైమ్ అధ్యాపకులను క్రమబద్దీకరించాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దయానందరావు, ప్రధాన కార్యదర్శి ఈశ్వర్, అధికార ప్రతినిధులు డా.దేశగాని సాంబశివ గౌడ్, అరుణక్వీన్, జక్కని సంజరు తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌డీఎఫ్ తీర్మానాలను పాలసీలుగా అమలు చేయండి : ప్రవీణ్‌కుమార్‌కు ఆకునూరి మురళి వినతి
తెలంగాణలో విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ ఐఏఎస్ అధికారి, సోషల్ డెమోక్రటిక్ ఫోరం (ఎస్‌డీఎఫ్‌్) కన్వీనర్ ఆకునూరి మురళి విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీఎస్‌పీ కార్యాలయంలో ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్.ఆర్.ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను ఆయన కలిశారు. సోషల్ డెమోక్రటిక్ ఫోరం (ఎస్‌డీఎఫ్) చేసిన తీర్మానాలను పాలసీలుగా అమలు చేయాలని ఆకునూరి మురళి కోరారు. రాష్ట్రంలో 40 లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
దేశంలో బీసీ కులగణన చేపట్టడంలో కేంద్రం నిర్లక్ష్యం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ విద్యను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో వ్యవసాయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. రైతు బంధు కౌలు రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్‌డీఎఫ్ కో కన్వీనర్లు రేగట్టే వెంకటరెడ్డి, ప్రొఫెసర్ లక్ష్మినారాయణ, డాక్టర్.ప్రీతి దయాల్, డాక్టర్.రమా, డాక్టర్.జగదీశ్వర్ ఉన్నారు.