కేంద్ర ఉద్యోగులకు 4 శాతం డీఏ

For central employees 4 percent DA– రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌
– ఆరు పంటలకు ఎంఎస్పీ: కేంద్రమంత్రివర్గం నిర్ణయాలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు 4 శాతం డీఆర్‌, రైల్వే ఉద్యోగుల బోనస్‌ చెల్లింపులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్రమంత్రి వర్గ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం నేషనల్‌ మీడియా సెంటర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించారు. ”కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్‌ అలవెన్సును (డీఏ), పెన్షనర్లకు 4 శాతం డియర్నెస్‌ రిలీఫ్‌ (డీఆర్‌) పెంచేందుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ఇస్తున్న డీఏ 42 శాతం నుంచి 46 శాతానికి పెరగనుంది. జులై 1 నుంచి పెరిగిన డీఏ, డీఆర్‌ వర్తించనుంది. 7వ వేతన సంఘం సిఫారసుల మేరకు కేంద్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. డీఏ పెంపు నిర్ణయంతో 48.67 లక్షల మంది ఉద్యోగులకు, 67.95 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది” అని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు.
రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌
రైల్వే ఉద్యోగులకు ఏటా ఇచ్చే ఉత్పతాదకత ఆధారిత బోనస్‌ కు సైతం కేంద్ర క్యాబినెట్‌ ఈ సందర్భంగా ఆమోదం తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను 78 రోజులకు సమానమైన వేతనాన్ని బోనస్‌ చెల్లించనున్నారు. ఆర్పీఎఫ్‌ సిబ్బంది మినహా ట్రాక్‌ మెయింటెనర్లు, లోకో పైలెట్లు, ట్రెయిన్‌ మేనేజర్లు, స్టేషన్‌ మాస్టర్లు, సూపర్‌ వైజర్లు, టెక్నీషియన్లు.. ఇలా అర్హులైన 11,07,346 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఇందుకోసం రూ.1968.87 కోట్లు వెచ్చించనున్నారు.
ఆరు పంటలకు ఎంఎస్పీ
గోధుమలు అధికంగా పండించే రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ మద్దతు ధరకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ అమోదం తెలిపింది. 2024-25 రబీ మార్కెటింగ్‌ సీజన్‌కు గానూ క్వింటాల్‌ కు రూ.150 చొప్పున పెంచి రూ.2,275గా నిర్ణయించింది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ స్థాయిలో గోధుమలకు మద్దతు ధర ప్రకటించడం ఇదే తొలిసారి. కేంద్ర వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్‌ (సీఏసీపీ) సిఫారసులకు అనుగుణంగా రబీ సీజన్‌కు సంబంధించి ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంచినట్టు అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. అలాగే బార్లీకి క్వింటాకు రూ.115 పెంచి రూ.1,850, శెనగకు క్వింటాకు రూ.105 పెంచి రూ.5,440, కందులకు క్వింటాకు రూ.425 పెంచి రూ.6,425, ఆవాలకు క్వింటాకు రూ.200 పెంచి రూ.5,650, సన్‌ ఫ్లవర్‌ క్వింటాకు రూ.150 పెంచి రూ.5,800గా కనీస మద్దతు ధరగా నిర్ణయించారు. అలాగే లఢక్‌ లో 13 గిగా వాట్స్‌ (జీడబ్ల్యూ) రెనెవబుల్‌ ఎనర్జీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌ (జీఈసీ) ఫేజ్‌-2కి కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రి వర్గ కమిటీ ఆమోదం తెలిపింది.