పాక్‌లో పేలుడు…40 మంది మృతి

 Explosion in Pakistan...40 killed– 120 మందికి గాయాలు
–  జెయుఐ-ఎఫ్‌ సదస్సు రక్తసిక్తం
ఇస్లామాబాద్‌ : ఆఫ్ఘనిస్తాన్‌ సరిహద్దును ఆనుకుని ఉన్న పాకిస్తాన్‌లోని ఖైబర్‌-పంక్తూన్‌ఖవా (కెపి) ప్రావిన్స్‌లోని బజౌర్‌ జిల్లా ఖర్‌ పట్టణంలో జమాతే ఉలేమా ఇస్లామ్‌-ఫజిల్‌ (జెయుఐ-ఎఫ్‌) నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 40మంది మరణించగా, 120మంది గాయపడ్డారు. వీరి లో 17 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. జెయుఐ-ఎఫ్‌ అనేది పాకిస్తాన్‌లో దియోబండ్‌ సున్నీ తెగకు చెందిన ఒక రాజకీయ పార్టీ. ఆ పార్టీ కార్యకర్తల సమావేశం జరుగుతుండగా ఈ దారుణం చోటుచేసు కుంది. ఈ విషయాన్ని కెపి ఆపద్ధర్మ సమాచార శాఖ మంత్రి ఫిరోజ్‌ షా జమాల్‌ ధ్రువీకరించారు.క్షతగాత్రులను పెషావర్‌, ఇతర ఆస్పత్రులకు హెలికాప్టర్ల ద్వారా తరలించారు. పేలుడు జరిగిన ప్రదేశాన్ని భద్రతా దళాలు సీల్‌ చేశాయి. సహాయక చర్యల్లో పాకిస్తాన్‌ సైన్యం, ఇతర విభాగాలు పాల్గొంటున్నాయని జమాల్‌ తెలిపారు. ఈ పేలుడులో జెయుఐ-ఎఫ్‌ నేత మౌలానా జియాఉల్లా జాన్‌ కూడా మరణించినట్లు బజౌర్‌ జిల్లా అత్యవసర విభాగ అధికారి సాద్‌ ఖాన్‌ మీడియాకు తెలిపారు. టెంట్‌ కింద నిర్వహించిన ఈ సమావేశానికి సుమారు 400 మంది దాకా జెయుఐ-ఎఫ్‌ సభ్యులు, మద్దతుదారులు హాజరైనట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించిందని, వెంటనే తాను స్పృహ తప్పిపడిపోయానని, తిరిగి మెలకువ వచ్చేసరికి ఎక్కడ చూసినా నెత్తురోడుతున్న వారే కనిపించారని చెప్పారు.