ఐటీ కమిటీ నివేదికను ఉభయ సభల్లోపెట్టొద్దు

– లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ చైౖర్మెన్లకు సీపీఐ(ఎం) ఎంపీ లేఖ
న్యూఢిల్లీ : డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లుపై వ్యాఖ్యలతో కూడిన పార్లమెంటరీ కమిటీ నివేదికను సభలో ప్రవేశపెట్టడానికి అనుమతించవద్దని సీపీఐ(ఎం) ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌ లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ చైర్మెన్‌లను కోరారు. ఈ మేరకు వారికి ఒక లేఖ రాశారు. ఉభయ సభలకు మార్గనిర్దేశనం చేసే నిబంధనలను తన లేఖలో ఉటంకిస్తూ ఆయన, బిల్లులను ప్రవేశపెట్టిన తర్వాత లోక్‌సభ స్పీకర్‌ గానీ లేదా రాజ్యసభ చైర్మెన్‌ గానీ పార్లమెంటరీ కమిటీలకు నివేదించనప్పుడు వాటిని పరిశీలించే అధికారం ఆ పార్లమెంటరీ స్థాయీ సంఘాలకు లేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత కేసులో డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లును ఇప్పటివరకు ఎన్నడూ పార్లమెంట్‌ ఉభయ సభల్లోనూ ప్రవేశపెట్టలేదు. అలాగే వాటిని పరిశీలన నిమిత్తం స్థాయీ సంఘాలకూ నివేదించలేదని తెలిపారు. శివసేన ఎంపీ ప్రతాప్‌ రావు జాదవ్‌ నేతృత్వంలోని కమ్యూనికేషన్స్‌, సమాచార సాంకేతిక పరిజ్ఞానంపై స్థాయీ సంఘంలో బ్రిట్టాస్‌ సభ్యుడిగా ఉన్నారు. ఈ నెల 26నాటి సమావేశంలో ఆమోదించబడిన కమ్యూనికేషన్స్‌, సమాచార సాంకేతిక పరిజ్ఞానంపై స్థాయీ సంఘం నివేదికకు కూడా ఎలాంటి చట్టపరమైన ఆమోదముద్ర లేదని ఆయన తెలిపారు. ఇది స్థాయీ సంఘం అధికారాలకు పూర్తి విరుద్ధంగా వుందని అన్నారు. జులై 26నాటి స్థాయీ సంఘ సమావేశాన్ని బ్రిట్టాస్‌సహా పలువురు ప్రతిపక్ష సభ్యులు బహిష్కరించారు. బ్రిట్టాస్‌ అసమ్మతి పత్రాన్ని అందజేశారు. కేంద్ర మంత్రివర్గం అభీష్టానికి అనుగుణంగా ఆ బిల్లును స్థాయీ సంఘం ఆనాటి సమావేశంలో ఆమోదించిందని తెలిపారు.
ప్రతిపక్ష ఎంపీలు లేవనెత్తిన అభ్యంతరాలను కమిటీలోని బీజేపీ సభ్యులు తోసిపుచ్చారు. ”ఈ బిల్లుపై వ్యాఖ్యలు, సిఫారసులను చేర్చడంలో కమిటీ తీసుకున్న చర్య దాని అధికార పరిధికి మించిందని, పైగా ఈ నివేదికను నిర్వీర్యం చేయడానికి బాధ్యత వహిస్తుందన్నది నిస్సందేహం.” అని బ్రిట్టాస్‌ పేర్కొన్నారు. లోక్‌సభ, రాజ్యసభల్లో నివేదికను ప్రవేశపెట్టడానికి అనుమతించవద్దని ఆయన రాజ్యసభ చైర్మెన్‌, లోక్‌సభ స్పీకర్‌లను కోరారు. ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లుపై పార్లమెంట్‌ చర్చ చేపట్టే అవకాశం వున్న నేపథ్యంలో ఆయన ఈ లేఖ రాశారు.

Spread the love