– ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు సమాయత్తమవ్వాలి
– తెలంగాణ సాహిత్య అకాడమీ
చైర్మెన్ జూలూరి గౌరీశంకర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దేశాన్ని మతభూతం ఆవహించిందనీ, ఆ ప్రమాదం నుంచి కాపాడుకొనేందుకు ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు సమాయత్తం కావాలని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరి గౌరీశంకర్ అన్నారు. మఖ్దూం మొహియుద్దీన్ 115వ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పైనున్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన పోరాటాలను వక్రీకరించి, చరిత్రకు మతం రంగు పూయాలని ప్రయత్నించే శక్తులపట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తెలంగాణ సాహితీ ప్రధాన కార్యదర్శి కే ఆనందాచారి మాట్లాడుతూ మఖ్దూం మొహియుద్దీన్ ఆదర్శాలు, ఆశయాలు, స్వప్నాలు నెరవేరాలంటే మనిషిని మనిషిగా గౌరవించే సమాజం కోసం పోరాడటమేనని స్పష్టంచేశారు. కార్యక్రమంలో కవులు, రచయితలు తంగిరాల చక్రవర్తి, ఆనంతోజు మోహనకృష్ణ, శాంతారావు, సలీమా, రేఖ, పేర్లరాము, సీపీఐ నాయకులు బోసు తదితరులు పాల్గొన్నారు.