– దంచికొట్టిన అమ్మాయిలు
– భారత తొలి ఇన్నింగ్స్ 410/7
– ఇంగ్లాండ్‌తో ఏకైక టెస్టు తొలి రోజు
– శుభ, జెమీమా, దీప్తి, భాటియా, దీప్తి అర్థ శతకాలు
టీ20 తరహా స్ట్రయిక్‌రేట్ లేదు. ప్రత్యర్థి బౌలర్లపై నిర్దాక్షిణ్య దండయాత్ర లేదు. బ్యాటింగ్ లైనప్ నుంచి ఒక్క సెంచరీ నమోదు కాలేదు. అయినా.. టీమ్ ఇండియా అమ్మాయిలు అదరగొట్టారు. టీమ్ గేమ్ స్ఫూర్తి ఏంటో ఇంగ్లాండ్‌కు రుచి చూపించారు. శుభ సతీశ్ (69), జెమీమా (68), యస్టికా భాటియా (66), దీప్తి శర్మ (60 నాటౌట్) అర్థ సెంచరీలతో కదం తొక్కటంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో రికార్డు స్కోరు దిశగా సాగుతోంది. బ్యాటర్లు సమిష్టిగా మెరవటంతో ఇంగ్లాండ్ మహిళలతో తొలి టెస్టు తొలి రోజే 410 పరుగులు పిండుకున్నారు. మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి రోజు 400 పైచిలుకు పరుగులు సాధించిన రెండో జట్టుగా టీమ్ ఇండియా రికార్డు నెలకొల్పింది.
నవతెలంగాణ-ముంబయి
ఇంగ్లాండ్‌తో ఏకైక టెస్టులో ఆతిథ్య భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. టీమ్ ఇండియా అమ్మాయిలు నవీ ముంబయిలో నవ ఇన్నింగ్స్‌లు నమోదు చేయటంతో ఇంగ్లాండ్‌కు ఊహించని షాక్ తగిలింది. అరంగ్రేట బ్యాటర్లు శుభ సతీశ్ (69, 76 బంతుల్లో 13 ఫోర్లు), జెమీమా రొడ్రిగస్ (68, 99 బంతుల్లో 11 ఫోర్లు) సహా యస్టికా భాటియా (66, 88 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్), దీప్తి శర్మ (60 నాటౌట్, 95 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీలతో మోత మోగించారు. నలుగురు బ్యాటర్లు 50 ప్లస్ స్కోర్లు సాధించటంతో టీమ్ ఇండియా తొలి రోజే 410 పరుగుల రికార్డు స్కోరు సాధించింది. నేడు టెయిలెండర్ల అండతో 500 పైచిలుకు స్కోరుపై కన్నేసి బ్యాటింగ్‌కు రానుంది.
ఓపెనర్లు నిరాశపరిచినా.. : టాస్ నెగ్గిన టీమ్ ఇండియా అమ్మాయిలు తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నారు. టీ20 సిరీస్ సాధించిన ఉత్సాహంలో ఉన్న ఇంగ్లాండ్ సహజంగానే ఫేవరేట్‌గా బరిలోకి దిగింది. ఫామ్‌లో ఉన్న భారత ఓపెనర్లు మంచి ఆరంభం ఇవ్వలేకపోయారు. స్మృతీ మంధాన (17), షెఫాలీ వర్మ (19) తొలి పది ఓవర్లలోనే పెవిలియన్ బాట పట్టారు. మూడు ఫోర్లతో ఎదురుదాడి చేసిన మంధాన.. నాలుగు ఫోర్లతో మెరిసిన షెఫాలీ వికెట్లు నిలుపుకోలేదు. దీంతో ఇంగ్లాండ్ ఆరంభంలో పైచేయి సాధించింది. ఓపెనర్ల నిష్క్రమణ తర్వాత ఆరంగ్రేట బ్యాటర్లు ఆకట్టుకున్నారు. శుభ సతీశ్, జెమీమా రొడ్రిగస్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త వహించారు. యువ బ్యాటర్ శుభ సతీశ్ 9 ఫోర్లతో 49 బంతుల్లోనే కెరీర్ తొలి అర్థ సెంచరీ నమోదు చేసింది. వికెట్ కాపాడుకోవటంతో పాటు రన్‌రేట్ సైతం ముందుకు సాగటంతో తొలి సెషన్లో భారత్ 136/2 పరుగులు చేసింది.
శుభ, జెమీమా జోరు : లంచ్ విరామం అనంతరం శుభ సతీశ్, జెమీమా రోడ్రిగస్ జోరు కొనసాగింది. ఈ జోడీ మూడో వికెట్‌కు శతక భాగస్వామ్యం నిర్మించింది. 146 బంతుల్లో 115 పరుగులు పిండుకుంది. దీంతో భారత్ నెమ్మదిగా టెస్టుపై పట్టు బిగించింది. రొడ్రిగస్ సైతం ఎనిమిది ఫోర్ల సాయంతో 82 బంతుల్లో అర్థ సెంచరీ సాధించింది. శుభ సతీశ్ ధనాధన్ బ్యాటింగ్‌తో ఇంగ్లాండ్ బౌలర్ల ప్రణాళికలు తారుమారు చేసింది. స్ఫూర్తిదాయక అర్థ సెంచరీల నుంచి శతక ప్రయాణం దశలో ఇద్దరూ వికెట్ కోల్పోయారు. దీంతో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, యస్టికా భాటియా ఇన్నింగ్స్ బాధ్యతను తీసుకున్నారు. రెండో సెషన్లో 125 పరుగులు పిండుకున్న భారత్ 2 వికెట్లు కోల్పోయింది. టీ విరామానికి భారత్ 261/4తో నిలిచింది.
పరుగుల వరద : తొలి రోజు చివరి సెషన్లో భారత బ్యాటర్లు పరుగుల వరద పారించారు. ఐదో వికెట్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్, యస్టికా భాటియా జోడీ సైతం సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ జోడీ 146 బంతుల్లో 116 పరుగులు జోడించింది. ఓ ఎండ్‌లో ప్రమాదకర హిట్టర్ హర్మన్ నిలిచినా.. ఈ భాగస్వామ్యంలో యువ బ్యాటర్ భాటియా అధిక పరుగులు చేయటం విశేషం. ఎనిమిది ఫోర్లు, ఓ సిక్సర్‌తో భాటియా 66 బంతుల్లోనే అర్థ సెంచరీ అందుకుంది. హర్మన్‌ప్రీత్ అర్థ సెంచరీకి పరుగు దూరంలో రనౌట్‌గా నిష్క్రమించింది. అయినా, ఈ సెషన్లో భారత్ జోరు తగ్గలేదు. డ్రింక్స్ విరామం అనంతరం స్నేV్‌ా రానా, దీప్తి శర్మ దంచికొట్టారు. ఈ జోడీ ఏడో వికెట్‌కు 147 బంతుల్లో 92 పరుగులు పిండుకుంది. దీప్తి శర్మ ఎనిమిది ఫోర్లు, ఓ సిక్సర్‌తో 78 బంతుల్లో అర్థ శతకం సాధించింది. రానా సైతం ఐదు బౌండరీలతో మెరిసింది. చివరి సెషన్లో భారత్ 149 పరుగులు చేసి, 3 వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో తొలి రోజు ముగిసే సరికి 94 ఓవర్లలో 7 వికెట్లకు 410 పరుగుల రికార్డు స్కోరు సాధించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో లారెన్ బెల్ (2/64), సీవర్ (1/25) రాణించారు.
స్కోరు వివరాలు :
భారత్ మహిళల తొలి ఇన్నింగ్స్ : స్మృతీ మంధాన (బి) బెల్ 17, షెఫాలీ వర్మ (బి) క్రాస్ 19, శుభ సతీశ్ (సి) సీవర్ (బి) ఎకల్‌స్టోన్ 69, జెమీమా రొడ్రిగస్ (బి) బెల్ 68, హర్మన్‌ప్రీత్ కౌర్ (రనౌట్) 49, యస్టికా భాటియా (సి) బెల్ (బి) డీన్ 66, దీప్తి శర్మ నాటౌట్ 60, స్నేV్‌ా రానా (బి) సీవర్ 30, పూజ నాటౌట్ 4, ఎక్స్‌ట్రాలు : 28, మొత్తం : (94 ఓవర్లలో 7 వికెట్లకు) 410.
వికెట్ల పతనం : 1-25, 2-47, 3-162, 4-190, 5-306, 6-313, 7-405.
బౌలింగ్ : కేట్ క్రాస్ 14-0-64-1, లారెన్ బెల్ 15-1-64-2, సీవర్ 11-4-25-1, లారెన్ ఫైలర్ 15-1-84-0, చార్లీ డీన్ 17-1-62-1, సోఫీ ఎకల్‌స్టోన్ 22-4-85-1.