– మొత్తం విలువ సుమారు రూ.40లక్షల 50వేలు
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండల కేంద్ర శివారులోని బ్రహ్మంగారి గుట్ట వద్ద ఎన్నికల కోడ్ అమలు సందర్భంగా ఏర్పాటుచేసిన నిజామాబాదు – జగిత్యాల్ జిల్లాల అంతర్ జిల్లా చెక్ పోస్ట్ వద్ద పోలీసులు మంగళవారం భారీ ఎత్తున బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కమ్మర్ పల్లి ఎస్ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా జగిత్యాల జిల్లా మెట్ పల్లి వైపు నుండి వస్తున్న ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేయగా వారి వద్ద పెద్ద ఎత్తున బంగారం, వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. సదరు వ్యక్తులను విచారించగా పట్టుబడ్డ ఆభరణాలకు సంబంధించి సరియైనల పత్రాలు చూపించక పోవడంతో బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. సుమారు 45.9 తులాల బంగారం ఆభరణాలు, సుమారు 17కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. అట్టి బంగారం, వెండి ఆభరణాలను పంచనామా నిర్వహించి స్వాధీనం చేసుకొని తగు చర్య నిమిత్తం సంబందిత అధికారులకి సమాచారం అందించి, జిల్లా ట్రెజరీ లో అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. స్వాధీనం చేసుకున్న 45.9 తులాల బంగారంలో 255 రకాల బంగారు ఆభరణాల విలువ సుమారు రూ.28లక్షల 9వేల 569 ఉందన్నారు. స్వాధీనం చేసుకున్న 17కిలోల వెండిలో 526 రకాల వెండి ఆభరణాల విలువ సుమారు రూ.12లక్షల 57వేల 761 ఉన్నట్లు తెలిపారు.మొత్తం బంగారం, వెండి ఆభరణాల విలువ సుమారు రూ.40లక్షల 50వేల వరకు ఉన్నట్లు వివరించారు. పెద్ద మొత్తంలో సాధించేసుకున్న బంగారు, వెండి ఆభరణాలను కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్లో భీమ్ గల్ సిఐ వెంకటేశ్వర్లు సందర్శించి పరిశీలించారు.