– దేశంలోనే అత్యధిక ఐటీి ఉద్యోగాలు హైదరాబాదులోనే
– త్వరలో నందనవనంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం : మంత్రి శ్రీనివాస్ గౌడ్
నవ తెలంగాణ-సరూర్‌నగర్
నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారము సరూర్‌నగర్ స్టేడియంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తేనే నగరంలో జీవించడానికి అవకాశాలు ఉంటుందన్నారు. పదో తరగతి నుండి పీజీ వరకు చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగ అవకాశం కల్పిస్తామని అన్నారు. చదువుకు చేసే ఉద్యోగానికి సంబంధం లేకుండా చాలామంది పనిచేస్తున్నారని, వారందరికీ వత్తి శిక్షణ నైపుణ్యాన్ని ఇచ్చి వారికి ఉపాధి కల్పిస్తామన్నారు. లక్ష్యం, నిజాయితీ ఉంటే అవకాశాలు వాటి అంతట అవే వస్తాయన్నారు. యాజమాన్యం ఇచ్చిన పనికంటే ఎక్కువ సమయం పనిచేసి సంస్థ అభివద్ధికి సహకరిస్తే ఉన్నత పదవులు అధిరోహించవచ్చు అన్నారు. భవిష్యత్తులో మూగ, చెవిటి, అంధ, వికలాంగులకు ప్రత్యేక జాబ్ మేళాను నిర్వహిస్తామని అన్నారు. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులకు 108 కంపెనీలను తీసుకువచ్చి స్పాట్లోనే ఆఫర్ లెటర్ ఇచ్చే విధంగా చర్యలు చేపట్టామని అన్నారు. జాబ్ మేళాకు ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌కు దాదాపు 50 వేల వరకు కాల్స్ వచ్చాయని, వారందరి వివరాలు నమోదు చేసుకున్నామని తెలిపారు. 13వేల ఉద్యోగాలకు 30వేల మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. తెలంగాణలో నిర్వహించిన 16 జాబు మేళాలో ఎల్బీనగర్లోనే అత్యధిక మంది నిరుద్యోగ యువత యువకులు హాజరయ్యారని తెలిపారు. చాలామందికి అపాయింట్మెంట్ లెటర్స్‌ను అందజేశామని, అత్యధిక జీతం 40వేలు, ఈ జాబ్ మేళాలో అమ్మాయిలే అత్యధిక అవకాశాలను అందిపుచ్చుకున్నారన్నారు అని అన్నారు. త్వరలో అపాయింట్మెంట్ తీసుకున్న వారందరితో, వారి కుటుంబ సభ్యులతో కలిసి విందు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎగ్గే.మల్లేశం, దయనంద్ గుప్తా, సెట్విన్ ఏం.డి.వేణుగోపాల్, కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం చైర్మన్ ఈశ్వరమ్మ యాదవ్,మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు,పలు డివిజన్ల అధ్యక్షులుపాల్గొన్నారు.