50వ 100 ఒకే ఒక్కడు

50th 100th
the only one– వన్డేల్లో 50వ శతకంతో ప్రపంచ రికార్డు
– సచిన్‌ రికార్డును తిరగరాసిన విరాట్‌ కోహ్లి
ప్రపంచకప్‌ సెమీస్‌లో రెండెంకల స్కోరు చేయలేదు. మూడు ప్రపంచకప్‌లు ఆడినా ఎప్పుడూ 500 ప్లస్‌ పరుగులు చేయలేదు. ప్రపంచకప్‌ నాకౌట్లో అర్థ సెంచరీ, శతకం పక్కనపెడితే.. కనీసం ఓ బౌండరీ కూడా బాదలేదు. ఇదీ విరాట్‌ కోహ్లి విమర్శకులు అతడిపై ఎక్కుపెట్టిన బాణం. 2023 ఐసీసీ ప్రపంచకప్‌లో విరాట్‌ కోహ్లి ఈ విమర్శలకు అన్నింటికి ఒకేసారి సమాధానం చెప్పాడు. ప్రపంచకప్‌ చరిత్రలోనే ఓ టోర్నీలో 700కు పైగా పరుగులు సాధించిన ఏకైక బ్యాటర్‌గా నిలిచిన విరాట్‌ కోహ్లి.. న్యూజిలాండ్‌తో సెమీఫైనల్లో శతకంతో చరిత్రే సృష్టించాడు. 113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 117 పరుగులు చేసిన విరాట్‌ కోహ్లి వన్డేల్లో రికార్డు 50వ సెంచరీ సాధించాడు. వన్డే క్రికెట్‌ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా కోహ్లి చరిత్ర సృష్టించాడు. కోల్‌కతలో దక్షిణాఫ్రికాపై శతకంతో సచిన్‌ టెండూల్కర్‌ 49 శతకాల రికార్డును సమం చేసిన కోహ్లి.. తాజాగా ముంబయిలో న్యూజిలాండ్‌తో వందతో సచిన్‌ను దాటేశాడు. 49 శతకాలకు సచిన్‌ టెండూల్కర్‌ 451 ఇన్నింగ్స్‌ల్లో బ్యాట్‌ పట్టగా.. విరాట్‌ కోహ్లి 277వ ఇన్నింగ్స్‌లోనే 49వ శతకం బాదేశాడు. 279వ వన్డే ఇన్నింగ్స్‌లో చారిత్రక 50వ శతకాన్ని సాధించాడు.
వాంఖడెలో ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్లో భారత్‌ స్కోరు 71/1 వద్ద క్రీజులోకి వచ్చిన విరాట్‌ కోహ్లి.. జట్టు ప్రణాళికల ప్రకారం ఆఖరు వరకు ఆడే ప్రయత్నం చేశాడు. తొలుత శుభ్‌మన్‌ గిల్‌తో 86 బంతుల్లో 93 పరుగులు జోడించిన కోహ్లి.. ఆ తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి 128 బంతుల్లోనే 163 పరుగులు జోడించాడు. ఈ రెండు కీలక భాగస్వామ్యాలతో భారత్‌ భారీ స్కోరుకు బాటలు వేశాడు. 59 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన కోహ్లి.. 100 మార్క్‌ను మరో 53 బంతుల్లోనే చేరుకున్నాడు. శతకానికి చేరువగా ఉండగా కండరాలు పట్టేసినా.. కోహ్లి తగ్గలేదు. చారిత్రక 50వ 100తో ముంబయి వాంఖడె స్టేడియంతో పాటు యావత్‌ దేశం ఊగేలా చేశాడు. తాజా ప్రపంచకప్‌లో 90.68 స్ట్రయిక్‌రేట్‌, 101.57 సగటుతో కోహ్లి ఏకంగా 711 పరుగులు చేశాడు. ఓ ప్రపంచకప్‌లో ఇదే అత్యధిక స్కోరు. సచిన్‌ టెండూల్కర్‌ 2003లో నెలకొల్పిన 673 పరుగుల రికార్డును కోహ్లి బద్దలు కొట్టాడు. ఇక 2011 సెమీస్‌లో 9, 2015, 2019 సెమీస్‌లో 1, 1 పరుగే చేసిన విరాట్‌ కోహ్లి ఈసారి మాత్రం లెక్క సరి చేశాడు. 117 పరుగుల రికార్డు శతకంతో ప్రపంచకప్‌లో నాకౌట్లో మేటీ ఇన్నింగ్స్‌ నమోదు చేశాడు.
వాంఖడె అభిమానుల నడుమ, నా భార్య అనుష్క శర్మ, నా ఆరాధ్య క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ చూస్తుండగా 50వ శతకం సాధించటం నిజంగా పర్‌ఫెక్ట్‌ పిక్చర్‌!. నేను ఈ సెంచరీ ఎలా సాధించాలని కోరుకున్నానో అలాగే అందుకున్నాను. ఈడెన్‌లో చెప్పినట్టు ఇక్కడి దాక వస్తానని ఊహించలేదు. ఇదంతా నాకో కలలా ఉంది. జట్టు ప్రణాళికల మేరకు ఓ ఎండ్‌లో క్రీజులో నిలబడుతూ.. మరో ఎండ్‌లో బ్యాటర్‌ స్వేచ్ఛగా ఆడేందుకు సహకారం అందిస్తున్నాను. జట్టు కోరితే బౌండరీలు కొట్టేందుకైనా, వికెట్ల మధ్య సింగిల్‌, డబుల్స్‌ తీసేందుకైనా సిద్ధమే. జట్టు విజయం కోసం ఎంతైనా చేస్తాను.
– విరాట్‌ కోహ్లి