– ఎస్జీటీయూ రాష్ట్ర కమిటీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో 5,571 ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు (పీఎస్‌హెచ్‌ఎం) పోస్టులను మంజూరు చేసి ప్రస్తుత పదోన్నతులతోపాటు భర్తీ చేయాలని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం (ఎస్జీటీయూ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. గురువారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఎస్జీటీయూ రాష్ట్ర అధ్యక్షులు కరివేద మహిపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి అరికెల వెంకటేశం ఒక ప్రకటన విడుదల చేశారు. 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని కోరారు. పండితుల అప్‌గ్రెడేషన్‌కు సంబంధించి కోర్టు తీర్పును వెలువరించి అర్హత గల ఎస్జీటీలకు అవకాశం కల్పించాలని సూచించారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని పేర్కొన్నారు. 13 జిల్లాల ఎస్జీటీ స్పౌజ్‌లకు ఒకే జిల్లాలో పోస్టింగ్ ఇవ్వాలని తెలిపారు. పాఠశాలల్లో స్వచ్ఛ కార్మికులను నియమించాలని డిమాండ్ చేశారు. పీఆర్సీలో ఎస్జీటీలకు, ఎస్‌ఏలకు మధ్య వేతన వ్యత్యాసాన్ని తగ్గించాలని పేర్కొన్నారు.