59,779 బ్యాలెట్‌ యూనిట్లు

CEC– 116 కౌంటింగ్‌ కేంద్రాలు ఎల్బీనగర్‌లో అత్యధికంగా 48 మంది పోటీ
– గజ్వేల్‌లో 44, కామారెడ్డిలో 39 మంది
– 51 శాతం పోల్‌స్లిప్‌ల పంపిణీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు గడువు సమీపిస్తుండటంతో ఎన్నికల సంఘం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 59,779 బ్యాలెట్‌ యూనిట్ల (బీయూ) ను (ఈవీఎమ్‌)ను వినియోగిస్తున్నది. వీటిలో అత్యధికంగా ఎల్బీనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో 1,719 బీయూలను వినియోగిస్తున్నారు. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌లోనూ మూడు బీయూలు ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకంటే ఇక్కడి నుంచి అత్యధికంగా 48 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఆ తర్వాతి రెండు, మూడు స్థానాలు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు పోటీచేస్తున్న గజ్వేల్‌, కామారెడ్డి ఉన్నాయి. గజ్వేల్‌లో 44 మంది పోటీలో ఉండగా 963 బీయూలను ఏర్పాటు చేస్తున్నారు. కామారెడ్డిలో 39 మంది పోటీచేస్తున్నారు. ఇక్కడ 798 బీయూలు వినియోగిస్తారు. అయితే ఓటర్లు అత్యధికంగా ఉన్న మల్కాజ్‌గిరిలో 33 మంది పోటీచేస్తున్నారు. ఇక్కడ 1,287 బీయూలు అవసరమని ఎన్నికల సంఘం లెక్కతేల్చింది. ఆ తర్వాతి స్థానంలో ఓటర్లు ఎక్కువగా ఉన్న మేడ్చల్‌ నియోజకవర్గంలో 22 మంది పోటీచేస్తుండగా, 1,168 బీయూలు అవసరమవుతున్నాయి. పోలింగ్‌ స్టేషన్లు, పోటీలో ఉన్న అభ్యర్థులు, అవసరమైన ఈవీఎమ్‌లు, కౌంటింగ్‌ కేంద్రాలు సహా అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. 119 నియోజకవర్గాలు, 33 జిల్లాల్లో మొత్తం 116 కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ అనంతరం ఈవీఎమ్‌లు భద్రపరిచేందుకు అవసరమైన స్ట్రాంగ్‌ రూంలనూ ఎన్నికల సంఘం అధికారులు పరిశీలించారు. ఈసారి ఎన్నికల్లో 135 పోలింగ్‌ కేంద్రాల లోకేషన్స్‌ మారాయి. 299 అదనపు పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 762 పోలింగ్‌ కేంద్రాల పేర్లు మారాయి. ఇంటింటికీ ఓటర్‌ స్లిప్పుల పంపిణీ 51 శాతం పూర్తయినట్టు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 3 కోట్ల 26 లక్షల 2 వేల 799 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 1 కోటి 65 లక్షల 32 వేల 040 మంది ఓటర్లకు (51 శాతం) పోల్‌ స్లిప్‌లు అందచేశారు. మిగిలిన స్లిప్పుల్ని ఈనెల 23వ తేదీలోపు అందచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు హైదరాబాద్‌ చంచల్‌గూడలోని ప్రభుత్వ ప్రింటింగ్‌ ప్రెస్‌లో బ్యాలట్‌ పేపర్ల ముద్రణ ప్రారంభమైంది. మొదటిగా పోస్టల్‌ బ్యాలెట్లను ముద్రించారు.
632.74 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన అక్టోబరు 9వ తేదీ నుంచి నవంబర్‌ 20వ తేదీ వరకు జరిగిన తనిఖీల్లో పట్టుబడిన సొత్తు విలువ రూ.632.74 కోట్లకు చేరినట్టు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. దీనిలో నగదుగా స్వాధీనం చేసుకున్న సొమ్ము రూ.236.35 కోట్లు ఉంది. మిగిలిన బంగారం, వజ్రాలు, ప్లాటినం, డ్రగ్స్‌, మద్యం, ఉచితాలు ఇతరత్రా వాటి విలువ రూ.396.39 కోట్లుగా ఉంది.

రూ.1,760 కోట్ల విలువైన డ్రగ్స్‌, నగదు, మద్యం స్వాధీనం
– అత్యధికంగా తెలంగాణలోనే రూ.659.2 కోట్లు
– తరువాత రాజస్థాన్‌లో రూ.650.7 కోట్లు : కేంద్ర ఎన్నికల సంఘం
హిమాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌, మేఘాలయ, త్రిపుర, కర్నాటక ఈ ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో రూ.1,400 కోట్ల విలువైన జప్తులు జరిగాయనీ, ఇది ఈ రాష్ట్రాలలో గత అసెంబ్లీ ఎన్నికలలో జరిగినదానికంటే 11 రెట్లు ఎక్కువని ఈసీ పేర్కొంది. ఈసారి ఎన్నికల వ్యయ పర్యవేక్షణ వ్యవస్థ (ఈఎస్‌ఎంఎస్‌) ద్వారా పర్యవేక్షణ ప్రక్రియలో ఎన్నికల కమిషన్‌ సాంకేతికతను కూడా ఉపయోగించిందనీ, ఇది మెరుగైన సమన్వయం, గూఢచార-భాగస్వామ్యానికి కేంద్ర, రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలను తీసుకువచ్చిందని ప్రకటనలో పేర్కొంది. నవంబర్‌ 30న పోలింగ్‌ జరగనున్న తెలంగాణలో అత్యధికంగా రూ.659.2 కోట్లు, ఆ తరువాత నవంబర్‌ 25న పోలింగ్‌ జరగనున్న రాజస్థాన్‌లో రూ.650.7 కోట్ల విలువైన నగదు, మద్యం ఇతరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. మధ్యప్రదేశ్‌ మొత్తం రూ.323.7 కోట్లు, ఛత్తీస్‌గఢ్‌లో రూ.76.9 కోట్లు, మిజోరంలో రూ.49.6 కోట్లు విలువైనవి స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొంది. పోల్‌ ప్యానెల్‌ వివిధ సేవలకు చెందిన 228 మంది అధికారులను వ్యయ పరిశీలకులుగా నియమించింది. నిశిత పర్యవేక్షణ కోసం 194 అసెంబ్లీ నియోజకవర్గాలు ”వ్యయానికి సంబంధించిన” స్థానాలుగా గుర్తించింది.