పకడ్బంధీగా 5ఎస్‌ విధానం అమలు చేయాలి

– ఎల్లారెడ్డిపేట్‌ స్టేషన్‌ను తనిఖీ ఎస్పీ అఖిల్‌ మహాజన్‌
నవతెలంగాణ – ఎల్లారెడ్డిపేట
ఎస్పీ అఖిల్‌ మహజన్‌ శుక్రవారం ఎల్లారెడ్డిపేట పోలీస్‌స్టేషన్‌ తనిఖీ చేశారు. స్టేషన్‌ పరిసరాలు, రికార్డుల నిర్వహణ రిసెప్షన్‌, జీడీ ఎంట్రీ తదితర రికార్డును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. మారుతున్న నేరాల నమూనాకు అనుగుణంగా గస్తీ, పేట్రోలింగ్‌లను పెంచాలన్నారు. స్టేషన్లలో క్రైమ్‌ పాట్రాన్స్‌, ఫంక్షనల్‌ వర్టీకాల్స్‌ పనితీరు పరిశీలించి 5ఎస్‌ ఇంప్లిమెంటేషన్‌ పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు. ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు.బ్లూకోల్ట్స్‌, పెట్రోల్‌ కార్‌ నిరంతరం 24/7 గస్తీ నిర్వహిస్తూ, డయల్‌ 100కాల్‌ రాగానే వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సమస్యలు పరిష్కరించాలన్నారు. పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిబ్బంది కృషి చేయాలని, అందరూ విధులు సక్రమంగా నిర్వహించడం ద్వారానే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయన్నారు. విజబుల్‌ పోలీసింగ్‌లో భాగంగా ప్రతి రోజు వాహనాల తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. రాత్రి పెట్రోలింగ్‌ అధికారులు పాత నేరస్తులను తనిఖీ చేయాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. విలేజ్‌ పోలీస్‌ అధికారులు తమకు కేటాయించిన గ్రామాల్లో తరచూ పర్యటిస్తూ గ్రామాలకు సంబంధించిన పూర్తి సమాచారం అందరి దగ్గర ఉండాలన్నారు. అదేవిధంగా గ్రామాల్లోని ప్రజలకు చట్టాల మీద, డయల్‌100, షీ టీమ్స్‌, సైబర్‌ నేరాలు, ట్రాఫిక్‌ నియమాలు తదితర అంశాల మీద అవగాహన కల్పించాలన్నారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకమన్నారు. మండల పరిధిలోని ప్రతి గ్రామంలో నాలుగు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు.