– ఆన్‌లైన్‌లో ముగిసిన గడువు
– 72,341 దరఖాస్తుల సవరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు గడువు మంగళవారంతో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 6,864 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో దరఖాస్తు చేసిన వారిలో 72,341 మంది అప్లికేషన్లను సవరించారు. వీటితో కలిపి బదిలీల కోసం మొత్తం 79,205 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేశారు. ఒకే పాఠశాలలో సెప్టెంబర్ ఒకటి నాటికి కనీసం రెండేండ్ల సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు బదిలీల కోసం దరఖాస్తు చేసేందుకు అర్హులుగా ఉన్న విషయం తెలిసిందే. ఒకే పాఠశాలలో గెజిటెడ్ హెచ్‌ఎంలు ఐదేండ్లపాటు మిగతా ఉపాధ్యాయులు ఎనిమిదేండ్లు పనిచేస్తే తప్పనిసరిగా బదిలీ అవుతారు. ఉద్యోగ విరమణకు మూడేండ్లలోపు సర్వీసు ఉన్న వారికి బదిలీ నుంచి మినహాయింపు ఉంటుంది. బుధ, గురువారాల్లో దరఖాస్తు ప్రతులను డీఈవో కార్యాలయాల్లో సమర్పించాలి. ఈనెల 8,9 తేదీల్లో దరఖాస్తు చేసిన వారి ప్రొవిజినల్ సీనియార్టీ జాబితాను డీఈవో, ఆర్జేడీల వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. 10, 11 తేదీల్లో దానిపై ఫిర్యాదులు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. 12,13 తేదీల్లో డీఈవో కార్యాలయాల్లో సీనియార్టీ జాబితాను పొందుపరుస్తారు. గ్రేడ్-2 హెడ్మాస్టర్ పోస్టులకు వెబ్‌ఆప్షన్లను నమోదు చేయాలి. ఈనెల 15న మల్టీ జోన్ స్థాయిలో గ్రేడ్-2 హెచ్‌ఎంల బదిలీలుంటాయి. 16న గ్రేడ్-2 హెచ్‌ఎం పోస్టుల ఖాళీల వివరాలను ప్రకటిస్తారు. 17 నుంచి 19 వరకు స్కూల్ అసిస్టెంట్లకు హెచ్‌ఎంలుగా పదోన్నతులు కల్పిస్తారు. 20, 21 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలను వెల్లడిస్తారు.
23,23 తేదీల్లో వారికి బదిలీలు చేపడతారు. 25న స్కూల్ అసిస్టెంట్ ఖాళీలను ప్రకటిస్తారు. 26 నుంచి 28 వరకు ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తారు. 29 నుంచి వచ్చేనెల ఒకటి వరకు ఎస్జీటీల ఖాళీలను వెల్లడిస్తారు. వచ్చేనెల మూడున ఎస్జీటీలకు బదిలీలు నిర్వహిస్తారు. అయితే బదిలీలు అయిన వెంటనే ఉపాధ్యాయులు కొత్త పాఠశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. వచ్చేనెల ఐదు నుంచి 19 వరకు అభ్యంతరాలపై అప్పీళ్లకు అవకాశమున్నది.