స్వేచ్ఛా, స్వాతంత్య్రం కోసం నిజాంతో జరిగిన ఉద్యమంలో తెలంగాణా సాయుధ పోరాటానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాలలో జరిగిన పోరాటం చరిత్ర పుటల్లో ఆ స్థానం సంపాదించు కుంది. మరో జలియన్ వాలా బాగ్ పోరాటంగా పేరు తెచ్చుకుంది. అజ్ఞాతంలోకి వెళ్లిన నాయకుల పిలుపుమేరకు నిజాం నిరంకుశ పాలనను నిరసిస్తూ గ్రామాల్లో ప్రజలు త్రివర్ణ పతాకాలు ఎగర వేయా లని అనుకున్నారు. సరిగ్గా 76 ఏళ్ల క్రితం. 1947 సెప్టెంబర్ 2న చుట్టుపక్కల గ్రామాల నుంచి విశేష సంఖ్యలో హాజరయ్యారు. పరకాలకి సుమారు ఐదు కిలో మీటర్ల పొడవు ఊరేగింపు సాగింది. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో కలపాలంటూ నినాదాలు చేశారు. వందేమాతరం అంటూ ర్యాలీ కొనసాగింది. అదే సమయంలో రజాకార్లకు పట్టరాని కోపం రగిలింది. మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన వారిని చెట్టుకు కట్టేసి దారుణంగా చంపారు. ఆ సమయంలో తెలంగాణ సాయుధ పోరాటవీరులు పరకాల పక్కన ఉన్న చెన్నకేశవస్వామి ఆలయం పరిసరాలు చంద్రగిరిగుట్ట దగ్గర సాయుధపోరాటం చేశారు. మందుగుండు సామాగ్రి, తపంచాలతో తమ స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయినా రజాకార్లు వీరిని వదిలి పెట్టలేదు. వీరి శిబిరాలపై తరచూ దాడులు చేస్తూ వచ్చారు. వారిపై రజాకార్లు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. నాటి ఘటనలో 15మంది ప్రాణాలు కోల్పో యారు. ఎంతోమంది క్షతగాత్రులయ్యారు! చివరగా 1948 సెప్టెంబర్ 17న సర్దార్ వల్ల భారు పటేల్ ముందు నిజాం ప్రభుత్వం లొంగిపోవడంతో ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. ఆ మట్టి.. రజాకార్లు పారించిన రక్తపుటేర్లకు సాక్ష్యం! నిరంకుశ నిజాం నుంచి సాతంత్య్రాన్ని కాంక్షించి అమరులైన యోధుల పోరాటానికి ఉత్తేజం. అదే.. మరో జలియన్ వాలాబాగ్ ఘటనగా చరిత్రలో నిలిచిపోయిన పరకాల ఊచకోత ఘటన! 19 ఏండ్ల క్రితం అమరుల స్మారకార్థం ఊచకోత జరిగిన ప్రాంతంలో నాటి ప్రజాప్రతినిధులు అమర ధామాన్ని నిర్మించారు. వారి స్మరణార్థం ప్రతి యేటా సెప్టెంబర్ 2న ఇక్కడ నివాళులర్పిస్తారు.
– కామిడి సతీష్ రెడ్డి, 9848445134