– సీఎస్‌కు తెలంగాణ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ మహిళా ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ లీవ్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కోరింది. సోమవారం ఈ మేరకు హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జె.వెంకటేశ్, జె.కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జె.కుమారస్వామి, ఉపాధ్యక్షులు పద్మశ్రీ వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ మహిళా ఉద్యోగులకు ఈ సెలవు వర్తించదనీ, సంబంధిత శాఖాధిపతులు సెలవు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న లక్షలాది మంది మహిళలు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో పాల్గొనేందుకు నిరాకరించడం అన్యాయమని వాపోయారు. ప్రపంచంలోని మహిళలందరూ సమానత్వం, సాధికారత కోసం హక్కుల దినాన్ని పాటిస్తున్న సమయాన వారిని భాగస్వాములను చేయకపోవడం భావ్యం కాదన్నారు. రాష్ట్ర తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తమ విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించి సెలవు మంజూరు చేయాలని కోరారు.