8న మునుగోడులో పాదయాత్ర ప్రారంభం

– 12న యాదాద్రిలో బహిరంగ సభ : వీఆర్‌ఏ హక్కుల సాధన సమితి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 8 నుంచి నల్లగొండ జిల్లా మునుగోడు నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్టు వీఆర్‌ఏ హక్కుల సాధన సమితి చైర్మెన్‌ ఆర్‌.విజరు ప్రకటించారు. సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. తమ పాదయాత్ర మునుగోడు నుంచి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వరకు కొనసాగుతుందని తెలిపారు. 12న యాదాద్రిలో బహిరంగ సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో భాగంగా చేస్తున్న ఈ పాదయాత్రలో వీఆర్‌ఏలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. 8న పాదయాత్ర ప్రారంభంలో మహిళా వీఆర్‌ఏలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.