– బంగారం విలువ రూ.4.86 కోట్లు
– నలుగురు ప్రయాణికుల అరెస్ట్
నవతెలంగాణ-శంషాబాద్
శంషాబాద్ అంత ర్జాతీయ విమానాశ్రయంలో 8 కిలోల బంగారాన్ని శని వారం హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు పట్టు కున్నారు. విదేశాల నుంచి బంగారాన్ని తరలిస్తున్న నలుగురిని అరెస్టు చేశారు. బంగారం విలువ సుమారు రూ. 4 కోట్ల 86 లక్షలు. హైద రాబాద్ కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంకాక్ నుంచి తెల్లవారుజామున హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుడు ట్రోజర్స్‌లో రూ.కోటి 21 లక్షల 34 వేల బంగారం తెచ్చాడు. గమనించిన కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరో ప్రయాణికుడు బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. అతని వద్ద 1.78 కిలో గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. కోటి 8లక్షల 81వేల 165 ఉంటుంది. షార్జా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికుడి వద్ద 2.17 కిలోల బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. దీని విలువ రూ.కోటి 31లక్షల 77వేల 524 ఉంటుందని అంచనా వేశారు. దుబారు నుంచి మరో ప్రయాణికుడు 2.05 కిలోల బంగారం తీసుకురాగా, అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురి వద్ద మొత్తం ఎనిమిది కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నారు.