ప్రపంచ జీడీపీలో 85 శాతం

85 percent of world GDP– వాణిజ్యంలో 75 శాతానికి పైగానే వాటా
– జనాభాలో మూడింట రెండు వంతులు
– జీ20 సభ్య దేశాల ఆధిపత్యం
న్యూఢిల్లీ : ఈనెల 9, 10 తేదీల్లో జరగనున్న జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం సభ్య దేశాల అధినేతలు, ప్రతినిధులు న్యూఢిల్లీకి తరలి వస్తున్నారు. ఆర్థిక పరిస్థితులపై చర్చించ నున్నారు. అయితే, ప్రపంచ దేశాల్లో జీ20 సభ్య దేశాలు ఆర్థికంగా, జనాభా పరంగా ఆధిపత్యాన్ని కనబరుస్తున్నాయి.
ఇవీ జీ20 దేశాలు
20.. ప్రపంచంలోని 19 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలతో పాటు యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)ను ఒక కూటమిగా కలిగి ఉన్నది. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, కెనడా, చైనా, ఫ్రాన్స్‌, జర్మనీ, భారతదేశం, ఇండోనేషియా, ఇటలీ, జపాన్‌, దక్షిణ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే), యునై టెడ్‌ స్టేట్స్‌(యూఎస్‌) లు ఇందులోని సభ్య దేశాలు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఈ దేశాలు ప్రపంచ స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)లో 85 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అలాగే, ప్రపంచ వాణిజ్యంలో 75 శాతానికి పైగా షేర్‌తో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తు న్నాయి. ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల వాటాను జీ20 సభ్య దేశాలు కలిగి ఉన్నాయి. సభ్య దేశాలతో పాటు ప్రతి ఏడాదీ జీ20 సమావేశాలు, సమ్మిట్‌లో పాల్గొనేందుకు అతిథి దేశాలను ఆహ్వానిస్తారు. ఈ సంవత్సరం, భారతదేశం తన జీ20 అధ్యక్ష పదవిలో బంగ్లాదేశ్‌, ఈజిప్ట్‌, మారిషస్‌, నెదర్లాండ్స్‌, నైజీరియా, ఒమన్‌, సింగపూర్‌, స్పెయిన్‌, యూఏఈలను అతిథి దేశాలుగా ఆహ్వానించింది.
ప్రపంచ జనాభాలో 60 శాతానికి పైగా
జీ20 సభ్య దేశాలలో దాదాపు 490 కోట్ల మంది ప్రజలు నివసి స్తున్నారు. సగటు ఆయుర్దాయం 78 సంవత్సరాలుగా ఉన్నది. ప్రపంచ సగటు వయస్సు 30గా ఉంటే.. జీ20 సభ్య దేశాల్లో ఇది 39గా ఉండటం గమనార్హం. వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ గణాంకాల ప్రకారం.. భారత్‌ (17. 85 శాతం), చైనా (17.81 శాతం) కలిసి ప్రపంచ జనాభాలో 35 శాతానికి జనాభా వాటాను కలిగి ఉన్నాయి. సభ్యదేశమైన యూఎస్‌ ప్రపంచ జనాభాలో 4.25 శాతం, ఇండోనేషియా 3.47 శాతం కలిగి ఉన్నాయి. జీ20 దేశాలలో అత్యల్ప జనాభాను ఆస్ట్రేలియా (0.33 శాతం) కలిగి ఉన్నది.
ప్రపంచ జీడీపీలో 85 శాతం
అంతర్జాతీయ ఆర్థిక సహకారాన్ని తన ఎజెండాలో ముందంజలో ఉంచే జీ20 ఫోరమ్‌ ప్రపంచ జీడీపీలో 85 శాతం వాటాను కలిగి ఉన్నది. ఏఎన్‌ఐ ప్రకారం.. 2023 నుంచి 2026 సంవత్సరాలకు చైనా 4.4 శాతం, టర్కీ 3 శాతం వద్ద ఆర్థిక వృద్ధి రేటును కలిగి ఉన్నాయి. భారత్‌లో ఇది 6.1 శాతంగా ఉన్నది.
ప్రపంచ వాణిజ్యంలో 70 శాతం కంటే ఎక్కువ
జీ20 దేశాలు ప్రపంచ వాణిజ్యంలో 70 శాతం కంటే ఎక్కువ వాటాతో ఏకఛత్రాధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఏఎన్‌ఐ నివేదిక ప్రకారం.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జీ20 దేశాలలో భారత ద్వైపాక్షిక వాణిజ్యంలో యూఎస్‌ భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్నది. రూ.10.70 లక్షల కోట్లు (129 బిలియన్‌ డాలర్లు) వాణిజ్యం, రూ. 2.29 లక్షల కోట్లు (27.7 బిలియన్‌ డాలర్ల) వాణిజ్య మిగులుతో ఉన్నది. భారత రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి చైనా (రూ. 9.44 లక్షల కోట్లు అంటే మొత్తం 113.8 బిలియన్‌ డాలర్ల వ్యాపార వాణిజ్యం) ఉన్నది. ఆ తర్వాతి స్థానాల్లో సౌదీ అరేబియా (రూ. 4.14 లక్షల కోట్లు అంటే 49.9 బిలియన్‌ డాలర్లు), రష్యా(రూ.4.10 లక్షల కోట్లు అంటే 49.4 బిలియన్‌ డాలర్లు)లు ఉన్నాయి.