9 నెలల్లో మేం అధికారంలోకి : భట్టి

నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్‌
రాబోయే 9 నెలల్లో కేంద్రం, రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌ శాసనసభాపక్షనేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. మంత్రి కేటీఆర్‌ పారిశ్రామిక పద్దును ప్రవేశపెట్టాక, భట్టి మాట్లాడారు. ‘మీరు అధికారంలోకి రాకముందు కాంగ్రెస్‌ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అన్ని సౌకర్యాలు సమకూర్చి, ఆటోమోడ్‌లో పెట్టిందనీ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇప్పుడు వాటినే అమలు చేస్తున్నదని అన్నారు. తన నియోజకవర్గంలో పెండింగ్‌ పనులు చేపట్టాలని కోరారు. మరో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా తన నియోజకవర్గంలోని పెండింగ్‌ పనులతోపాటు మెట్రోరైల్‌ కావాలని అడిగారు. దీనిపై మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ, 9నెలల్లో అధికారంలోకి వస్తే, మీరు మమ్మల్ని అడగడం ఎందుకు? మీరే పనులు చేసుకోవచ్చుగా…అని ఛలోక్తి విసిరారు.
మల్లారెడ్డి నవ్వులు
కార్మిక శాఖ పద్దును అసెంబ్లీలో ప్రవేశపెడుతూ ఆ శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ను సూర్యచంద్రులు అంటూ కీర్తించారు. కేటీఆర్‌ ముఖ్యమంత్రి, కేసీఆర్‌ ప్రధాని అవుతారంటూ రాసుకొచ్చిన ప్రసంగాన్ని గంభీరంగా చదివారు. దీనితో సభలోని సహచర ఎమ్మెల్యేలు మల్లారెడ్డి ప్రసంగించినంతసేపూ…వహ్వా..వహ్వా అంటూ వంతపాడుతూ బిగ్గరగా నవ్వేశారు. అంతకుముందు దాదాపు 1గంట 40 నిముషాలు మంత్రి కేటీఆర్‌ గంభీరంగా మాట్లాడారు. మల్లారెడ్డి వ్యాఖ్యలతో సభలో ఒక్కసారిగా నవ్వుల వాతావరణం ఏర్పడింది. స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డికి అమితాబ్‌బచ్చన్‌ నటించిన ‘ముఖద్దర్‌ కా సికిందర్‌’ సినిమా కథ వినమని చెప్పడం హాస్యాన్ని పండించింది.