విచ్చలవిడిగా తెలంగాణ ఫార్మసీ ఎన్నికల నామినేషన్‌ ఫారమ్స్‌..!

– రిటర్నింగ్‌ అధికారి సంతకం లేకండానే అందజేత
– ఎవరికి పడితే వారికి.. ఎన్ని అంటే అన్ని పంపిణీ
– ఫార్మసీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం
నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్‌ వివాదాలకు కేరాఫ్‌గా మారుతోంది. పది రోజుల కిందటి వరకు రిజిస్ట్రేషన్‌, రెన్యువల్‌కు చేతివాటం ప్రదర్శించిన కొందరు కౌన్సిల్‌ ఉద్యోగులు.. ఇప్పుడు కౌన్సిల్‌ ఎన్నికల నామినేషన్‌ పత్రాలను విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు. ఇలాంటి చర్యలు కౌన్సిల్‌ ఎన్నికలపై ఎఫెక్ట్‌ పడే ఛాన్స్‌ ఉంటుంది.
త్వరలో తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్‌ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ కౌన్సిల్‌లో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 55వేల మంది ఫార్మసిస్టులు రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఉన్నారు. వీరంతా ఈ ఎన్నికల్లో వారి ఓటు హక్కును పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా వినియోగించుకోనున్నారు. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ నెల 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నామినేషన్‌ ఫారాలను జారీ చేశారు. కౌన్సిల్‌లో పని చేసే కొందరు ఉద్యోగులు ఒక్కో ఫార్మసిస్టుకు ఎన్ని ఫారాలు అడిగితే అన్ని ఇచ్చేస్తున్నారు. ఫారాలు అందజేసే సమయంలో వారు ఫార్మసిస్టులా..? కారా..? వారి రిజిస్ట్రేషన్‌, రెన్యువల్‌ అప్‌డేట్‌ అయ్యి ఉందా..? లేదా..? రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ ఎంత..? అనే వివరాలను చెక్‌ చేయడం లేదు. బాగా తెలిసిన వారికైతే ఎన్ని అడిగితే అన్ని ఫారాలు ఇచ్చేస్తున్నారు. ఇక ఏమైనా తప్పుగా రాస్తే మరోటి ఇస్తామని చెబుతున్నారు. దాంతోపాటు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సంతకం లేకుండానే నామినేషన్‌ ఫారాలను పంపిణీ చేస్తున్నారు.
సమస్యలు ఎదురయ్యే అవకాశం
తెలంగాణ ఫార్మసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఫార్మసిస్టులు ఎక్కువగా ఆసక్తి చూసిస్తున్నారు. చివరి రోజు మంగళవారం మధ్యాహ్నం వరకు దాదాపు 170 మంది వరకు నామినేషన్‌ పత్రాలను రిజిస్టార్‌కు అందజేశారు. కాగా ఇష్టానుసారంగా నామినేషన్‌ ఫారమ్స్‌ అందజేస్తే సమస్యలు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. ఉదాహరణకు మధు (పేరు మార్చాం) అనే వ్యక్తి తన పేరు మీద ఒక ఫారం తీసుకున్నాడు అనుకోండి. అతను తన పేరు, వివరాలు, రిజిస్ట్రేషన్‌ నెంబర్‌తో ఫారం నింపి అందజేస్తాడు. అపోనెంట్‌ క్యాండిడెట్‌ మధు (పేరు మార్చాం) పేరు మీద ఫారం తీసుకుని నింపి అందజేసే అకాశం లేకపోలేదు. ఇలా చేస్తే స్క్రూట్నీ సమయంలో ఇద్దరి ఫారాలు రిజెక్ట్‌ అవుతాయి. దీని వల్ల ఒరిజినల్‌ (మధు) ఫార్మసిస్టుకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. స్క్రూట్నీలో తిరస్కరణకు అవకాశం కూడా ఉంటుంది. నామినేషన్‌ ఫారంను ఎవరైనా తప్పుగా నింపినా, లేక ఏదైనా లెటర్‌ కానీ, పేరు కానీ సరిగా నమోదు చేయకపోయినా రిటర్నింగ్‌ అధికారి సంతకం లేకపోవడంతో కౌన్సిల్‌లో పని చేసే ఉద్యోగుల సహాయంతో మరో ఫారం నింపి ఇచ్చే అవకాశం ఉంటుంది. రిటర్నింగ్‌ అధికారి సంతకం లేకపోవడం, ఫారం మీద నెంబర్‌ మెనిషన్‌ లేకపోవడం వల్ల డూబ్లికేట్‌గాళ్లు, అపోనెంట్‌ క్యాండిడెట్స్‌ మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఫార్మసిస్టులు కోరుతున్నారు.
నిబంధనలు పాటిస్తున్నాం బి.యోగానందం, రిజిస్టార్‌, తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్‌
ఫార్మసీ కౌన్సిల్‌ ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నాం. ఫారం సబ్‌మిట్‌ చేసిన తర్వాత పరిశీలన చేసి నెంబర్‌ వేస్తున్నాం. స్క్రూట్నీ మా పరిధిలో ఉండదు. సికింద్రాబాద్‌లోని ఆయుష్‌ కార్యాలయంలో జరుగుతుంది.
ఎన్నికల రిటర్నింగ్‌ ఆఫీసర్‌ ఆ వ్యవహారాన్ని చూసుకుంటారు. నామినేషన్ల స్వీకరణ వరకు మాత్రమే కౌన్నిల్‌కు సంబంధం.