అంగన్వాడీల సమ్మెకు పశుమిత్రల మద్దతు

–  పశుమిత్ర వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసు మాధవి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని పశుమిత్ర వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసు మాధవి తెలిపారు. బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అంగన్‌వాడీ ఉద్యోగుల పర్మినెంట్‌, పెన్షన్‌, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ టీచర్లకు రూ.10 లక్షలు, ఆయాలకు రూ.5 లక్షలు చెల్లింపు, తదితర డిమాండ్లన్నీ న్యాయసమ్మతమైనవేనని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ ఉద్యోగులపై ప్రభుత్వం సాగిస్తున్న అణచివేత, దమనకాండ వెంటనే ఆపేయాలని డిమాండ్‌ చేశారు. ఇది అంగన్‌వాడీ ఉద్యోగులపై దాడి మాత్రమే కాదనీ, ఇది ఉద్యోగ, కార్మికుల హక్కులపై దాడి అని పేర్కొన్నారు. ఇప్పటికైనా అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్బంధాన్ని ఆపి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.లేనిపక్షంలో ఐక్య ఉద్యమాలకు సన్నద్ధం అవుతామని తెలిపారు.