కేరళలో ‘నిపా’ కలకలం

–  కోజికోడ్‌లో వైరస్‌ ఇన్ఫెక్షన్‌ నిర్ధారణ
–  రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్‌.. పొరుగు జిల్లాల్లో అప్రమత్తం
కోజికోడ్‌ : కేరళలో నిపా వైరస్‌ ఆందోళన కలిగిస్తున్నది. కోజికోడ్‌లో నిపా వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ నిర్ధారణ కావడంతో రాష్ట్ర సర్కారు అప్రమత్తమైంది. కోజికోడ్‌ పొరుగు జిల్లాలైన కన్నూర్‌, వయనాడ్‌, మలప్పురం జిల్లాలకు కేరళ ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్‌ మాట్లాడుతూ.. ఆరోగ్య శాఖ ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌)ని సంప్రదించిందనీ, ఒక ప్రయివేటు ఆస్పత్రిలో చేరిన నిపా రోగుల చికిత్స కోసం మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ లభ్యతపై హామీ ఇచ్చిందని తెలిపారు. కోజికోడ్‌లో జ్వరం కారణంగా ఇద్దరు మృతి చెందారు. దీంతో ఆరోగ్య శాఖ ఇప్పటికే అలర్ట్‌ ప్రకటించింది. ఇది నిపా అని నిర్ధారించడానికి నమూనాలను పూణే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపారు. నిపా వైరస్‌ విషయంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం తగిన చర్యలను తీసుకుంటున్నాయి. రక్షణ కార్యకలాపాలను ముందుగానే ప్రారంభించామనీ, ఆ ప్రాంతంలో కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, నిఘా కార్యకలాపాలు కూడా కొనసాగుతున్నాయని ఆరోగ్య మంత్రి తెలియజేశారు. పరిస్థితిని సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకోవడానికి మంత్రి వీణా జార్జ్‌ గత రాత్రి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా యంత్రాంగంతో కార్యకలాపాలను సమన్వయం చేసేందుకు ఆరోగ్య మంత్రి, ప్రజాపనుల శాఖ మంత్రి మహమ్మద్‌ రియాస్‌ మంగళవారం ముందుగానే కోజికోడ్‌ చేరుకున్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, బాధిత ప్రాంతాల ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్‌, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, ఇతర అధికారులతో మంత్రులు అత్యవసర సమావేశం జరిపారు.ఇటు జిల్లాలో నిపా కంట్రోల్‌ రూమ్‌ ప్రారంభించబడింది. మంత్రి వీణా జార్జ్‌ కోజికోడ్‌ మెడికల్‌ కాలేజీని కూడా సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. రోగుల సంరక్షణ కోసం పీపీఈ కిట్లు, ఎన్‌95 మాస్క్‌లు, వైద్య సిబ్బందికి ఇతర రక్షణ పరికరాలు అందుబాటులో ఉండేలా మంత్రి హామీ ఇచ్చారు. ఆస్పత్రుల్లో తగిన సంఖ్యలో సిబ్బంది, మందులు ఉండేలా ఆదేశాలు జారీ చేశారు.కేరళలో సంభవించిన రెండు అసహజ మరణాలు నిపా వైరస్‌ కారణంగానే సంభవించాయని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవ్య ధృవీకరించడంతో కేంద్రం మంగళవారం ఆరోగ్య నిపుణుల బృందాన్ని కేరళకు తరలించింది.గతంలో కేరళలో 2018లో కోజికోడ్‌, మలప్పురం జిల్లాల్లో నిపా వైరస్‌ వ్యాప్తి చెందగా, తర్వాత 2021లో కోజికోడ్‌లో నిపా వైరస్‌ కేసు నమోదైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం.. నిపా వైరస్‌ ఒక రకమైన గబ్బిలాల వల్ల వస్తుంది. ఇది మానవులకు, జంతువులకు ప్రాణాంతకం. ఈ నిపా వైరస్‌ శ్వాసకోశ అనారోగ్యంతో పాటు, జ్వరం, కండరాల నొప్పి, తలనొప్పి, తల తిరగడం, వికారం వంటి సమస్యలను కలిగిస్తుంది.