మోడీ పాలనలో విద్య కాషాయీకరణ

In the Modi regime
Saffronization of education– పాఠ్యపుస్తకాల నుంచి కొన్ని భాగాల తొలగింపు
– ఎన్‌సీఈఆర్‌టీ తీరుపై కేరళ సీఎం ఆగ్రహం
తిరువనంతపురం : కేంద్రంలోని మోడీ పాలనలో విద్య కాషాయీకరణ కసరత్తు కొనసాగుతున్నది. ఇందు కోసం పాఠశాల స్థాయి నుంచి పుస్తకాల్లో మార్పులు, చేర్పులకు మోడీ సర్కారు చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే అనేక పాఠ్యాంశాలను తొలగించటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందుకోసం కేంద్రం సంబంధిత అధికార యంత్రాంగాలను ఆయుధంగా వాడుకుంటున్నది. హయ్యర్‌ సెకండరీ పాఠ్యపుస్తకాల నుంచి కొన్ని భాగాలను తొలగించాలని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ) తీసుకున్న నిర్ణయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ బుధవారం తీవ్రంగా విమర్శించారు. ఇది స్వార్థ ప్రయోజనాలతో కూడుకున్నదని అన్నారు. ఈ చర్యల విద్యార్థులకు హాని కలిగిస్తుందని ఆయన ఆరోపించారు. పాఠ్యపుస్తకాల్లో కొన్ని భాగాల తొలగింపు వల్ల విద్యార్థులు చరిత్రను గ్రహించే విధానం మారిపోతుందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మన లౌకిక ఆలోచనకు, సోదర సమాజానికి ప్రమాదం కలిగిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. పాఠ్యపుస్తకాల భారాన్ని తగ్గించి, వాటిని హేతుబద్ధీకరించేందుకు నిపుణుల కమిటీ సిఫారసు మేరకు మార్పులు చేశామని ఎన్‌సీఈఆర్‌టీ చేసిన ప్రకటనను కూడా ఆయన ప్రశ్నించారు. ఈ నిపుణుల గుర్తింపును కూడా వెల్లడించలేదని ఆయన అన్నారు. గాంధీ హత్యకు సంబంధించిన అధ్యాయాన్ని మినహాయిస్తే, ఇందులో పాల్గొన్న వ్యక్తులు, సంస్థలను కప్పిపుచ్చే యత్నం
జరిగిందని తెలిపారు. ఇలాంటి సంస్థలను ఈరోజు కప్పిపుచ్చే వారు రేపు గాంధీ హంతకుడైన గాడ్సేని గొప్ప వ్యక్తిగా చిత్రీకరిస్తారనడంలో సందేహం లేదని విజయన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Spread the love