– రూ.7,210 కోట్లతో ఈ-కోర్ట్స్ ప్రాజెక్టు : కేంద్రమంత్రివర్గం ఆమోదం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
వచ్చే మూడేండ్లలో కొత్తగా 75 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు కేంద్రమంత్రివర్గం ఆమోదించింది. రూ.7,210 కోట్లతో ఈ-కోర్ట్స్ ప్రాజెక్టు మూడో దశ వంటి పలు నిర్ణయాలను కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ మీడియాకు వెల్లడించారు.
మెస్సర్స్ సువెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్‌లో రూ.9,589 కోట్ల వరకు విదేశీ పెట్టుబడులకు సంబంధించి అందిన ప్రతిపాదనకు ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. రూ.7,210 కోట్లతో ఈ-కోర్ట్స్ మిషన్ మోడ్ ప్రాజెక్టు మూడో దశకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. న్యాయ వ్యవస్థలో మరింత పారదర్శకత, కాగిత రహిత కార్యకలాపాల కోసం రూపొందించిన ఈ- కోర్ట్సులను వచ్చే నాలుగేండ్లలో అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ ఫైలింగ్, ఈ పేమెంట్ వ్యవస్థకు ఉపయుక్తంగా ఉండే కోర్టు కాంప్లెక్సుల్లో 4,400 ఈ-సర్వీసు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రూ.1,650 కోట్లతో మరో 75 లక్షల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేయాలని కేంద్రమంత్రివర్గం నిర్ణయించిందని తెలిపారు. ఉజ్వల యోజనకు అదనంగా మూడేండ్ల పాటు వీటిని పంపిణీ చేస్తామని తెలిపిందన్నారు.
జీ20 శిఖరాగ్ర సదస్సును విజయవంతం చేసినందుకుగాను యావత్ దేశ ప్రజల తరపున ప్రధాని మోడీకి అభినందనలు తెలుపుతూ చేసిన ఓ తీర్మానానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జీ20లో ఆఫ్రికన్ యూనియన్ చేరిక, గ్లోబల్ బయోఫ్యుయల్ అలయెన్స్ ఏర్పాటు వంటి ప్రధాని మోడీ ప్రతిపాదించిన అంశాలపై ఏకాభిప్రాయం తీసుకురావడం దేశం మొత్తానికి ఎంతో గర్వకారణమని క్యాబినెట్ ప్రశంసించింది. ఇలా జీ20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించినందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ చేసిన ఓ తీర్మానాన్ని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రతిపాదించగా.. దాన్ని కేంద్ర మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది.