ఐసీడీఎస్‌ కార్యాలయాల ముట్టడి

Siege of ICDS offices– కొనసాగుతున్న అంగన్‌వాడీల సమ్మె
– ఖమ్మంలో మంత్రుల పర్యటన సందర్భంగా అరెస్టులు
– నిరసనగా పోలీస్టేషన్‌ ఎదుట ఆందోళన
–  పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల మద్దతు
నవతెలంగాణ- విలేకరులు
తమ సమస్యల పరిష్కారం.. ఉద్యోగ భద్రత, కనీస వేతనం కోసం అంగన్‌ వాడీలు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఐసీడీఎస్‌ కార్యాలయాలను ముట్టడించారు. వీరికి పలు రాజకీయ పార్టీలు, సంఘాల నేత లు మద్దతు తెలిపారు. ఖమ్మంలో మంత్రుల పర్యటన నేపథ్యంలో యూనియన్‌ జిల్లా కార్యదర్శిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా పొలాల అమావాస్య పండుగను పురస్కరించుకుని బోనాల జాతర చేపట్టారు. అంగన్‌వాడీలు నెత్తిన బోనాలు ఎత్తుకుని శోభాయాత్రగా తరలివెళ్లి అమ్మవారికి సమర్పించారు. యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు కె.సునీత మాట్లాడుతూ.. పండుగను కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించుకుంటామని, తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేపట్టడంతో ప్రస్తుతం అలా జరుపుకోలేకపోతున్నామని చెప్పారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
ఖమ్మం జిల్లాలో మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, పువ్వాడ అజరుకుమార్‌ పర్యటన సందర్భంగా అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి బి.కోటేశ్వరీని నేలకొండపల్లి పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అక్రమ అరెస్టును నిరసిస్తూ నేలకొండపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట సీఐటీయూ, అంగన్వాడీ యూనియన్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. భద్రాచలం రూరల్‌లో పట్టణంలోని అంబేద్కర్‌ సెంటర్‌లో సమ్మె శిబిరాన్ని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కె.బ్రహ్మచారి ప్రారంభించారు. బూర్గంపాడులో చెవిలో పూలు పెట్టుకుని అంగ న్వాడీలు నిరసన తెలిపారు. అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో సమ్మెకు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మద్దతు తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఐసీడీఎస్‌ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున నిరసన తెలిపారు. సీఐటీయూ, కాంగ్రెస్‌ నాయకులు మద్దతు తెలిపారు. షాద్‌నగర్‌లో సమ్మెకు సీఐ టీయూ జిల్లా అధ్యక్షులు రాజు మద్దతు తెలిపి మాట్లాడారు. రాజేంద్రనగర్‌ ఐసీ డీఎస్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సీఐడీపీఓ అధికారులకు వినతి పత్రం అందజేశారు. వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట మండల కేంద్రంలో అంగన్‌ వాడీలు మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. తాండూర్‌ ఐసీడీఎస్‌ కార్యాల యం ఎదుట ధర్నా చేశారు. అంగన్‌వాడీలను వేధింపులకు గురి చేయొద్దని సీడీపీఓకు వినతిపత్రం అందజేశారు. యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని ఐసీడీఎస్‌ కార్యాలయాన్ని మట్టడించారు. నల్లగొండ జిల్లా మును గోడులోని సీపీడీఓ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె నుద్దేశించి సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడారు. నల్ల గొండ సీపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. రంగారెడ్డి జిల్లాలోని సరూర్‌నగర్‌ సీడీపీఓ కార్యాలయాన్ని సీఐటీయూ ఆధ్వర్యంలో హయత్‌నగర్‌ ప్రాజెక్ట్‌ అంగన్వాడీ వర్కర్స్‌, ఆయాలు ముట్టడించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమోహన్‌ మాట్లాడుతూ.. అంగన్వాడీలు అడుగుతున్నది గొంతెమ్మ కోరికలు కాదని.. వారికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. బడంగ్‌పేట్‌ మేయర్‌ పారిజాత నర్సింహారెడ్డి, కార్పొరేటర్లు సుదర్శన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని అల్వాల్‌లో సీడీపీఓ కార్యాలయం(యాప్రల్‌) ముందు నిరసన వ్యక్తం చేశారు.