చెదరని గురుతులు

Unbreakable weightsదినకరుడి కాళ్ళకి
నా కళ్ళనతికించుకుని మరీ
వెతుకుతాను నీ జాడ కోసం

నిశి రాత్రిలో
మిణుకు మిణుకు మిణుగురులు
తళుకు తళుకు చుక్కలు
తోడు నడుస్తాయి నా బాధ చూడలేక
అప్పుడప్పుడూ….
పున్నమి వెన్నెల నా చేతిలో
లాంతరై దారి చూపుతుంది

ఏ పొన్నపూలో వాసనలొదిలి
మనం ఏకాంతంగా కలుసుకునే చోట
నీవున్నవనే జాడ తెలుప చూస్తాయి
ఆ వాసనల దారం అంచుల పట్టుక
నేనొస్తుంటే
అకస్మాత్తుగా ఓ పాడు గాలి
దాన్ని మాయం చేసి
నన్ను దిక్కులేని దాన్ని చేస్తుంది సఖుడా…

అలసిపోయి
కొండ కొసల కూచుండి
దీర్గాలోచనలో ఉంటున్నపుడు
అక్కడే… అక్కడే…
మనం ఒకరి పాదాలతో
ఒకరం చేసుకున్న బాసలు గురుతోచ్చి
ఒళ్లు జలదరిస్తుంది

దూప చేసి కాసింత గొంతు
తడుపుదామని
గబగబా కిందకి దిగి
ఏటి ఒడ్డుకు చేరుతాన
ఇరువురమే కమలాల మధ్య
దోబూచులాడుకున్న
జ్ఞాపకమొకటి గురుతొచ్చేసరికి
దాహం మరింత పెరిగి
గొంతెండి పోతుంది

నీ జ్ఞాపకాల వడగాలి
నా ఒంటిలో రాజేసిన వేడికి
నా నోటిలో
లాలాజలం కూడా ఆవిరైపోతుంది

ఎటూ పాలుపోకా…
నీ జ్ఞాపకాల నుండి తప్పించుకోడానికి
ఓ కూని రాగం తీద్దామని గొంతెత్తితే
చివరికి నీతో కలిసి పాడుకున్న
ప్రణయ విరహ రాగమొకటి గురుతొచ్చి
గొంతు పెగలక
మౌన రాగమే నా తోడు నడుస్తుంది…

– దిలీప్‌.వి, 8464030808