ఏ పార్టీ చేయని విధంగా పార్టీ సభ్యులకు ఇన్సూరెన్స్‌

– పద్మాదేవేందర్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దేశంలో ఏ రాజకీయ పార్టీ అమలు చేయని విధంగా సీఎం కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యులకు ఇన్సూరెన్స్‌ పథకాన్ని ప్రవేశపెట్టారని మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి తెలిపారు. బాధిత కుటుంబాలకు శనివారం హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తొమ్మిదేండ్లుగా ప్రాణాలు కోల్పోయిన వేలాది పార్టీ సభ్యుల కుటుంబాలకు రూ.రెండు లక్షల చొప్పున అందించినట్టు తెలిపారు. సభ్యుల ఇన్సూరెన్స్‌ కోసం రూ.100 కోట్లను బీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ కంపెనీలకు ప్రీమియం ద్వారా చెల్లించిందని తెలిపారు. ఆయా వర్గాల వారీ కోసం కూడా బీమా పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీ హైదరాబాద్‌ జిల్లా ఇన్‌ఛార్జి దాసోజు శ్రవణ్‌ మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పార్టీ 60 లక్షల మంది సభ్యుల కోసం 2023-24 ఏడాదికి రూ.25.54 కోట్లు ప్రీమియం చెల్లించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్సురెన్స్‌ ఇన్‌ ఛార్జీ సోమ భరత్‌ కుమార్‌ పాల్గొన్నారు.