– 25 వరకు వెబ్‌ఆప్షన్ల నమోదు
– షెడ్యూల్ విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్)కు సంబంధించి డిగ్రీ కాలేజీల్లో మిగిలిపోయిన ఖాళీ సీట్ల భర్తీకి ప్రత్యేక కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 21 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, విద్యాశాఖ కార్యదర్శి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ వాకాటి కరుణ శనివారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈనెల 19, 20 తేదీల్లో ఇంట్రా కాలేజీ రెండో విడతకు వెబ్‌ఆప్షన్లను నమోదు చేసేందుకు అవకాశముందని తెలిపారు. 21న అందుకు సంబంధించిన సీట్లు కేటా యిస్తామని వివరించారు. ఈనెల 21 నుంచి 24 వరకు రిజిస్ట్రేషన్ చేసు కోవాలని సూచించారు. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వారు రూ.400 చెల్లిం చాలని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్‌ఆప్షన్లను నమోదు చేయని వారు, రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఇప్పటి వరకు సీట్లు పొందనివారు, సీట్లు కేటాయించినా కాలేజీల్లో చేరని వారు అర్హులని వివరించారు. ఈనెల 21 నుంచి 25 వరకు వెబ్‌ఆప్షన్లను నమోదు చేసేందుకు అవకాశముందని తెలిపారు. ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులు (వికలాంగులు, సీఏపీ, ఎన్‌సీసీ, ఎక్స్ ట్రా కరిక్యులర్ ఆక్టీవిటీస్) అభ్యర్థులకు ఈనెల 25న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు. ఈనెల 29న సీట్లు కేటాయిస్తామని తెలిపారు. అదేనెల 29, 30 తేదీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు. ఆయా తేదీల్లోనే కేటాయించిన కాలేజీల్లో రిపోర్టు చేయాలని కోరారు.
3 నుంచి స్పాట్ అడ్మిషన్లు వచ్చేనెల మూడు, నాలుగు తేదీల్లో ప్రయివేటు, ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలతో పాటు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో చేరేందుకు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ ఉంటుందని లింబాద్రి, వాకాటి కరుణ తెలిపారు.