ఐఆర్‌, ఫిట్‌మెంట్‌ అందించాలి

IR and fitment should be provided– కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
నవతెలంగాణ – ముషీరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఐఆర్‌ ఫిట్‌మెంట్‌ అందించి ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు జె.వెంకటేష్‌ డిమాండ్‌ చేశారు. ఐఆర్‌, ఫిట్‌మెంట్‌ సాధనకు శనివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు సంగ్రామ సభ నిర్వహించారు. ఈ సభలో పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 40 వేల మంది కాంట్రాక్ట్‌ పద్ధతిన, సుమారు 90 వేల మంది ఔట్‌సోర్సింగ్‌ విధానంలో పని చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్‌ వ్యవస్థను రద్దు చేస్తామని వాగ్దానం చేసి నేటికీ క్రమబద్ధీకరించకుండా అన్యాయం చేస్తోందన్నారు. లక్షా ముప్పై వేల మందికి పైగా ఉన్న ప్రభుత్వ ఔట్‌సోర్సింగ్‌, ఎన్‌ఎంఆర్‌, డైలీవేజ్‌ తదితర సిబ్బందిని దశల వారీగా పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించి కాంట్రాక్ట్‌ ఏజెన్సీలను రద్దుచేసి ప్రభుత్వమే నేరుగా వేతనం చెల్లించాలని కోరారు. ఇప్పటికీ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సంఖ్యలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతున్నద న్నారు.కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వివరాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. రాష్ట్రం ఏర్పడిన 9 ఏండ్ల కాలంలోనూ నికరంగా, నిబద్ధతతో ఫెడరేషన్‌ ఉద్యమిస్తున్నదని తెలిపారు. విజ్ఞప్తులు, వినతులతో ఈ ప్రభుత్వం మనగోడు పట్టించుకోదన్నారు.
సంఘటిత, ఐక్యశక్తిగా కదిలితేనే పాలకుల మెడలు వంచగల మని, హామీలు సాధించుకోగలమని అన్నారు. సెప్టెంబర్‌ 20 నుంచి అక్టోబర్‌ 15 వరకు నేటి బహిరంగ సభ ఇచ్చిన పిలుపును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్‌ 20 నుంచి 30 వరకు ఉమ్మడి జిల్లాల ఫెడరేషన్‌ సదస్సులు, అక్టోబర్‌ 1 నుంచి 5 వరకు డిమాండ్‌ బ్యాడ్జీలు, లంచ్‌ అవర్‌ డెమోన్‌స్ట్రేషన్‌లు, అక్టోబర్‌ 12, 13 తేదీల్లో కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహిస్తామన్నారు. అక్టోబర్‌ 15లోపు డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెతో సమరశీల కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.
జె.వెంకటేష్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగ నియామకాల్లో ఔట్‌సోర్సింగ్‌, డైలీవేజ్‌, ఎన్‌ఎంఆర్‌ తదితర వర్కర్లకు ప్రాముఖ్య తనివ్వాలని కోరారు. వారి సర్వీసు ఆధారంగా దశల వారీగా రెగ్యులరైజ్‌ చెయ్యాల న్నారు. పర్మినెంట్‌ ఉద్యోగులకు అమలు చేసిన తేదీ నుంచే కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా పీఆర్సీ ఇవ్వాలని కోరారు. అలాగే, హెల్త్‌ కార్డులు మంజూరు చేయాలన్నారు. రూ.10 లక్షలు ప్రమాద బీమా, జీవిత బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ఈ కార్య క్రమంలో తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షు లు భూపాల్‌, కృష్ణారెడ్డి, పద్మశ్రీ, కుమార్‌, మధు సోమన్న, సాంబయ్య, సురేష్‌, జనమా, పదీష్‌, సుమిత్ర, జగదీష్‌, విజయవర్థన్‌ రాజులు పాల్గొన్నారు.