– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నర్సింహారావు
– గచ్చిబౌలి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో
– తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల సభ
నవతెలంగాణ-మియాపూర్
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ నుంచి విముక్తి కోసం సాగినదే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నర్సింహారావు అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులు మాత్రమేనని స్పష్టం చేశారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్ గచ్చిబౌలి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం సభ నిర్వహించారు. ఈ సభలో డీజీ నర్సింహారావు మాట్లాడుతూ.. సాయుధ పోరాటంతో సంబంధం లేని వారు నేడు ఇష్టానుసారంగా మాట్లాడుతు న్నారన్నారు. చరిత్రను వక్రీకరించే కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతంలో జాతి, కులం, మతం, ప్రాంతానికి అతీతంగా నిజాం నవాబుకు వ్యతిరేకంగా నిర్వహించిన మహత్తర పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటం అని గుర్తు చేశారు. ఇంతటి పోరాటాన్ని బీజేపీ, దాని పరివారం కేవలం ముస్లిం రాజుకు వ్యతిరేకంగా నిర్వహించిన పోరాటంగా అభివర్ణిస్తున్నాయని విమర్శించారు. ఈ పోరాటానికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ పోరాటంలో కమ్యూ నిస్టులు విరోచితంగా పోరాటం చేశారని గుర్తు చేశారు. సాయుధ పోరా టంలో అమరులైన వారందరికీ నివాళి అర్పించాల్సిన అవసరం ఉందన్నారు. నాటి చరిత్రను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌వీకే సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.