వాస్తు పేరుతో బోగస్‌ ప్రచారం

Bogus propaganda in the name of Vastu– వ్యాపారం కోసమే :సీనియర్‌ ఆర్కిటెక్ట్‌ ఆర్‌వీ. ఆచారి
– మీడియా సైతం దోహదం చేసిందని వ్యాఖ్య
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
వాస్తు పేరుతో బోగస్‌ ప్రచారం సాగుతున్న దనీ, తద్వారా వ్యాపార ప్రయోజనాలు నేరవేర్చు కుంటున్నారని బెంగళూరుకు చెందిన సీనియర్‌ ఆర్కిటెక్ట్‌ ఆర్‌వీ ఆచారి ఆందోళన వ్యక్తం చేశారు. రచనలు, సలహాలు, సూచనలతో పేరుతో ప్రజల ను మోసం చేస్తున్న పరిస్థితులు సైతం ఉన్నాయని చెప్పారు. భూమి ఎప్పుడూ గుండ్రంగా తిరుగు తూనే ఉంటుందనీ, దానికి ఉత్తర, దక్షిణ ధృవాలు ఎక్కడ ఉంటాయనీ, దానికి లేని హద్దులు ఇండ్లకు ఎలా వస్తాయని ప్రశ్నించారు. బుధవారం సుంద రయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ‘వాస్తు శాస్త్రం’ పుస్తక పరిచయం కార్యక్రమం నిర్వహించారు. దీనికి సీనియర్‌ ఇంజినీర్‌ కె.ఎల్‌ కాంతారావు అధ్యక్షత వహించగా, ఎస్‌వికె మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌.వినయకుమార్‌ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆర్‌వీ ఆచారి వాస్తు శాస్త్రం గురించి చెబుతూ డబ్బులు సంపాదించడం కోసమే వాస్తు శాస్త్రాన్ని స్వార్థం కోసం వినియోగించుకుం టున్నారని వివరించారు. మొదట్లో వాస్తును ఆర్కిటెక్ట్‌లు వ్యతిరేకించారనీ, మారుతున్న పరిస్థితు లకు అనుగుణంగా వాస్తును వారు సైతం వ్యాపారం కోసం వాడుకున్నారని చెప్పారు. దీనికి మీడియా సైతం దోహదం చేసిందని గుర్తు చేశారు. ప్రజలు ప్రచారాన్ని నమ్మి తప్పడుగులు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో ఏదైనా నష్టం, కష్టం కలిగితే దానికి వాస్తు కారణమనే మూఢ భావనతో ప్రజలు ఉండటం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వర్ణాశ్రమ ధర్మానికి సైతం వాస్తును ముడిపెట్టారని చెప్పారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఒక్కోక్కరు ఒక్కోలా ఇండ్లు కట్టుకోవాలని చెబుతుండటం పూర్తిగా వాస్తుశాస్త్ర వ్యతిరేకమని వివరించారు. ఇందులోనూ మనుషుల మధ్య తేడాలు చూపించడం వాస్తు శాస్త్రానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. వాస్తులోనూ మహిళల పట్ల వివక్ష కొనసాగిందని అన్నారు. ఇంటిని ఒకే కలపతో నిర్మించకపోతే ఆ ఇంటి మహిళలు వ్యభిచారులుగా మారతారనే దుష్ఫప్రచారం సమాజంలోఉందనీ, ఇది ఎంతమాత్రం సరికాదని చెప్పారు. వాస్తు అనేది నైపుణ్యానికి సంబంధించిన అంశమని తెలియ జేశారు. ఐదు వేల ఏండ్ల క్రితమే దేశంలో గొప్పగొప్ప కట్టడాలు,అద్భుత నిర్మాణాలు జరిగాయనీ, తంజా వూరు దేవాలయం అందులో భాగమేనని అన్నారు. రాయికి రాయిని సపోర్టు చేసిన ఆ ఆలయ నిర్మాణం అద్భుతమని వివరించారు. అధ్యక్షత వహించిన కేఎల్‌ కాంతారావు మాట్లాడుతూ వాస్తు అనేది మూఢనమ్మకమని తెలిపారు. ఇది గత 30 నుంచి 40 ఏండ్లుగా భయంకరంగా ప్రచారంలోకి వచ్చిందని అభిప్రాయపడ్డారు. ముందు చాదస్తం అనేవారనీ, ఆతర్వాత వాస్తు పేర పిచ్చిగా మారిందని అన్నారు. భూమి ఎత్తుపల్లాలుగా ఉంటే శత్రువులు ఎక్కువగా ఉంటారనే ప్రచారాన్ని ఖండించారు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌తో ఇండ్లు మొత్తం ఎత్తు,పల్లాలతో నిండి ఉంటాయని చెప్పారు. అక్కడ అందరూ గొప్పగా బతుకుతున్నారని చెప్పారు. చీమలు, పాములు, గుడ్లు, ఉన్న నేలలు ఉంటే మరణం సంభవిస్తుందని అని వాస్తు శాస్త్రంలో ఉందనీ, అయితే అవి లేకుండా నేలలు ఉంటాయా ? అని ప్రశ్నించారు.