– బాధ్యతగా వ్యవహరిద్దాం
– 361 పోస్టుల భర్తీకి చర్యలు
– జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట: సమాచార శాఖ సమీక్షలో మంత్రి మహేందర్ రెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
కొత్తగా ఏర్పడిన తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని ప్రజలకు బాధ్యతగా తెలియ జేయాలని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. సచివాలయంలో శుక్రవారం సమాచార, పౌర సంబంధాల శాఖపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర సమాచార శాఖ ప్రత్యేక కమీషనర్ కె. అశోక్‌రెడ్డి, డైరెక్టర్ బి. రాజమౌళి, అన్ని జిల్లాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎక్కువ పనిచేసి తక్కువ చూపిస్తున్నామని చెప్పారు.
రాష్ట్రం అన్ని రంగాలలో సాధిస్తున్న ప్రగతితో పాటు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కుటుంబ, రైతు సంక్షేమ పథకాలు లాంటి వాటికి, బతుకమ్మ సంబరాలు వినాయక చవితి, శ్రీరామ నవమి, జాతరలు, మహనీయుల చారిత్రక వారసత్వ అంశాలతో పాటు ఉత్సవాలు, రంజాన్, క్రిస్మస్ పండుగ సందర్భంగా చేపడుతున్న కార్యక్రమాలను సామాజిక చైతన్యం కోసం మరింత ఎక్కువగా ప్రచారం చేయాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. సమాచార శాఖలో ఖాళీలుగా ఉన్న వివిధ స్థాయిలోని 361 పోస్టులను త్వరలో భర్తీ కోసం సీఎం కేసీఆర్‌కు నివేదిస్తామన్నారు. సమాచార శాఖ బలోపేతానికి అవసరమైన అధునాతన కెమెరాలు, వీడియో కెమెరాలతో పాటు సిబ్బందికి వాహనాలు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. సోషల్ మీడియా సమాజంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో సమాచార, పౌర సంబంధాల శాఖ సోషల్ మీడియాలో తన పాత్రను మరింత పెంచుకోవాలని చెప్పారు.
జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట
తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ రూ. 100 కోట్లు జర్నలిస్టుల సంక్షేమం కోసం అందించడం జరిగిందన్నారు. కరోనా బాధితులు, ప్రమాద బాధితులు తదితర 479 జర్నలిస్టు కుటుంబాలకు రూ. 6.25 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించామన్నారు. 136 మంది జర్నలిస్టులకు ఆర్థిక సహాయంగా ఒక్కొక్కరికి రూ. 50 వేల చొప్పున రూ. 68 లక్షలు అందించామని వివరించారు. దేశంలోనే రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా 22,686 జర్నలిస్ట్‌లకు అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. జర్నలిస్టుల పిల్లల చదువుల కోసం నెలకు రూ.1000 చొప్పున రూ. 74 లక్షల 37 వేలు అందించేందుకు ప్రభుత్వం కషి చేసిందన్నారు. జర్నలిస్ట్‌ల కోసం రూ. 15 కోట్లతో నిర్మించిన మీడియా అకాడమీ భవనం పూర్తయ్యిందనీ, త్వరలోనే సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తామని వివరించారు. భవనంలో ఆధునిక సదుపాయాల కోసం మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మరింత డబ్బు అడిగారనీ, మంజూరు చేసేందుకు కృషి చేస్తామన్నారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలలో జర్నలిస్టులకు ప్రెస్‌క్లబ్‌లను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు.