ఆమె జీవన గమనం ‘సూర్యునితో పోటీపడి’

విశ్వ ప్రపంచానికి తొట్టతొలిగా కథను అందించిన నేల ఇది. గుణాడ్యుని ‘బృహత్‌ కథ’ ఎంతో ప్రాచీనమైనది. డా||నలిమెల భాస్కర్‌ చాలా విలువైన ముందు మాట రాశారు. ”నిబద్దత, తాత్త్వికత, ఒక సామూహిక చేతన రూపు కట్టిస్తోంది తన కథల ద్వారా” అన్నారు.
ఉపాధ్యాయుల జీవితాలనూ కథీకరించారు రచయిత్రి. సమస్యలు కథీకరించడం, ఉత్తమ పురుషలో పాఠకులు మెచ్చేలా రాయడం ఓ సాహసం. ఈనాడు సమాజంలో అవకతవకలు, స్త్రీ పట్ల వివక్ష, చులకన, అత్యాచారాలు, హత్యాచారాలు, ఆర్థిక అసమానతలు… వీటికి తోడు పురుషాధిక్యత, మూఢనమ్మకాలు, విశ్వాసాలు, అసమాన స్త్రీ మూర్తుల త్యాగాలు, కన్నీళ్లు, కష్టాలు. ఈ సంపుటిలోని 18 కథల్లో అంతస్సూత్రంగా అగుపిస్తాయి. కొన్ని కొన్ని ఘటనలు, సంఘటనలు సమూహిక చేతన చాలా గొప్పదని, ఐక్య పోరాటాలు, జడత్వం నుండి చైతన్యం దిశగా ‘దిశా’ నిర్దేశం చేయదగ్గ వస్తుబలం కల కథలివి. ఖాకీపులి, నాంది, సూర్యునితో పోటీ పడి, కర్ఫ్యూ కబంధ హస్తాలలో, జీవన సమరం లాంటి కథలు అన్యభాషల్లోకి అనువదింపదగిన ప్రగతి శీల కథాంశాలు.
అమృతోత్సవ భారతదేశ సంబరాల హేల ‘స్వాతంత్య్రమంటే?’ ఏంటి అనే అంశం గురించి ప్రతి ఒక్కరూ సీరియస్‌గా ఆలోచింపజేసే కథ (పేజీ 11). ఈ కథలో స్వాతంత్య్రం 43 సంవత్సరాల సంబరాలు జరిపిన రోజును మన కళ్ల ముందే ఓ డాక్యుమెంటరీ చిత్రంలా చూపే కథ.
రోజుకూలీల జీవితం- నీటి పారుదల ఆఫీసు క్లర్కు జీవితాన్ని ఈ కథలో చూపారు. సంపన్నులకే స్వాతంత్య్రం. సామాన్యులకు కాదు అని చెప్పే కథ ఇది. (మేడిపండు స్వాతంత్య్రం – రాచపుండు దరిద్రం) అన్నాడో కవి. ఒక పార్కులో రిటైరయిన సామాన్య మధ్య తరగతి వేతన జీవుల వెతల సమాహారంగా ‘రీ రిక్య్రూట్‌మెంట్‌’ కథలో అద్భుతంగా ఆవిష్కరించారు రచయిత్రి.
మీడియా ప్రభావంతో 8వ తరగతి చదివే పిల్లలు సైతం ప్రేమ లేఖలు రాసే వైనాన్ని, విద్యార్థుల మానసిక స్థితిని, టీచర్లు, హెడ్మాస్టర్ల వైఖరిని అద్దం పట్టే కథ ‘శాపం?’. (పేజీ 25). ఈ మధ్య ‘స్మార్ట్‌ఫోన్‌ తో మార్ఫింగ్‌ ఫొటోల వేధింపులతో ఇద్దరు బాలికల ఆత్మహత్య ఉదంతం మనసున్న ప్రతి ఒక్కరినీ కలచి వేసిన సంఘటన. ఇంటర్‌ విద్య నుండి ఇంజనీరింగ్‌, డాక్టర్‌ చదివే యువ మహిళలు సైతం అఘాయిత్యాలకు, ఆత్మహత్యలకు బలైతున్నారు. ‘నెట్‌, స్మార్ట్‌ఫోన్ల’ వల్లే అని వేరేగా చెప్పక్కర్లేదు. 1980 ప్రాంతం పోలీసుల కూంబింగ్‌, అన్నల జాడ చెప్పమని అమాయక అటవీ ప్రాంత గిరిజనులపై పోలీసుల పైశాచిక దాడి ఘటన, సి.ఐ ని, పోలీసుల్ని సస్పెండ్‌ చేయించి, సత్తెమ్మకు, ఎల్లమ్మకు న్యాయం చేయించి ప్రజల్ని చైతన్యం చేసే మహిళా నాయకురాలిగా ‘విజరు’ పోరాట పటిమ తెలిపే కథ ‘ఖాకీపులి’ (పేజీ49). అన్నీ కథలు చెప్పేస్తే విషయ సూచిక అవుతుంది. మీరూ చదవండి. కాలక్షేపం కథలు కావు, ఆలోచనా స్రవంతి పెంచే ప్రగతిశీల కథలివి.
– తంగిరాల చక్రవర్తి, 9393804472