– యూనివర్సిటీల అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులను వినియోగించాలి
– కేంద్రీకృత చర్యలతోనే ఉన్నత విద్యా పరిరక్షణ సాధ్యం
– రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విద్యార్థులను రాజకీయ భాగస్వామ్యానికి దూరంగా ఉంచటాన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ ఒక కుట్రగా అభివర్ణించారు. దీని పర్యవసనాలు సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని హెచ్చరిచారు. తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో ప్రగతిపథంలో దూసుకెళుతోందని ఆయన అన్నారు. అయితే ఉన్నత విద్య, వైద్యరంగాల్లో ఇంకా చేయాల్సింది చాలా ఉందని అభిప్రాయపడ్డారు. యూనివర్సిటీల అభివృద్ధి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్ ) నిధులను వినియోగించాలని ఆయన సూచించారు. సమాజ కేంద్రీకృత చర్యలతోనే ఉన్నత విద్యారంగాన్ని పరిరక్షించగలుగుతామని ఆయన నొక్కి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీల అధ్యాపకుల మూడో సమావేశం శనివారం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా ఉన్నత విద్య, సమకాలీన అంశాలు అనే అంశంపై బోయినపల్లి ముఖ్యవక్తగా ప్రసంగించారు. విద్యార్థులు అప్రెంటిషిప్ ల ద్వారా వాస్తవిక అనుభవాన్ని పొందేందుకు వీలు కలుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో టీఎస్ పీఎస్సీ మాజీ చైర్మెన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, టీఎస్ యుటీఏ అధ్యక్షులు ప్రొఫెసర్ జి.మల్లేశం, ప్రొఫెసర్ మల్లికార్జున్ రెడ్డి (కేయూ), ప్రొఫెసర్ సీహెచ్. శ్రీనివాస్, ప్రొఫెసర్ గుంటి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఎస్ యూటీఏ లోగోను వారు ఆవిష్కరించారు.