– ప్రొఫెసర్ల బదిలీలకు పచ్చజెండా
– ఉత్తర్వులను వైద్య సంఘాల ప్రతినిధులకు అందజేసిన మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. యూజీసీ ఎరియర్స్‌ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో పాటు డిఎంఇ పరిధిలో పని చేస్తున్న ప్రొఫెసర్ల బదిలీకి పచ్చ జెండా ఊపింది. నెలరోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కాపీలను ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు వైద్య సంఘాల ప్రతినిధులకు స్వయంగా అందజేశారు. కార్యక్రమంలో టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైద్య సిబ్బందికి ఎటువంటి లోటు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటున్నదని చెప్పారు. గతంలో 20 ఏండ్ల సర్వీస్ తర్వాత ప్రొఫెసర్ ప్రమోషన్లు వచ్చేవనీ, ప్రస్తుతం ఏడేండ్ల సర్వీసు నిండిన వెంటనే ప్రొఫెసర్ పదోన్నతి పొందుతున్నట్టు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కొందరు అసిస్టెంట్, మరికొందరు అసోసియేట్ ప్రొఫెసర్లుగా రిటైర్డ్ అవుతున్నారని గుర్తు చేశారు. కొత్తగా క్రియేట్ అయిన ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఇప్పటికే పని చేస్తున్న ప్రొఫెసర్లకు ముందుగా అవకాశం ఇచ్చి, మిగిలిన పోస్టుల్లో పదోన్నతుల ద్వారా నింపాలని అనుకుంటున్నామని చెప్పారు.
సీఎం కేసీఆర్‌కు, హరీశ్ రావుకు ధన్యవాదాలు
జీవో ప్రతులు అందుకున్న అనంతరం తెలంగాణ బోధనా వైద్యుల సంఘం సీఎం కేసీఆర్ కు, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. హరీశ్ రావును సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీటీజీడీఏ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ అన్వర్, డాక్టర్ జలగం తిరుపతి రావు, ఉపాధ్యక్షులు కిరణ్ మాదాల, కోశాధికారి కిరణ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.