– మాజీ మంత్రి మోత్కుపల్లి విజ్ఞప్తి
– రాజకీయాలకు అతీతంగా స్పందించాలని వ్యాఖ్య
– నేడు ఎన్టీఆర్ఘాట్ దగ్గర దీక్ష
నవతెలంగాణ-హైదరాబాద్
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు స్పందించాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో కేసీఆర్ పనిచేశారనీ, నేను ఎన్టీఆర్ ప్రభుత్వంలో పనిచేశానని చెప్పారు. రాజకీయాలు పక్కనబెట్టి కేసీఆర్ స్పందిస్తే ప్రజాస్వామ్యానికి మంచిదని అభిప్రాయపడ్డారు. నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను, కానీ, వ్యక్తిగతంగా చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించానని చెప్పారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు కచ్చితంగా గెలుస్తారని వ్యాఖ్యానించారు.చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా ఆదివారం ఎన్టీఆర్ ఘాట్‌లో నిరసన దీక్ష చేపడతానని ప్రకటించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిరసన దీక్ష చేయనున్నట్టు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ఖండించాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబును అరెస్ట్ చేసినందుకు ఏపీ సీఎం జగన్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు. శనివారం హైదరాబాద్‌లో ఎన్టీఆర్ఘాట్ వద్ద దివంగత ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. అనంతరం మీడియా మాట్లాడుతూ జైలులో చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్‌దే బాధ్యతని హెచ్చరించారు. . జగన్‌ను నమ్మి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పూర్తిగా మోసపోయారని అభిప్రాయపడ్డారు. దళితులపై గతంలో ఎన్నడూలేనివిధంగా ఘోరాలు జరుగుతున్నాయని చెప్పారు. ఏపీ సీఎం జగన్ దళిత ద్రోహి అని విమర్శించారు. జగన్ వైఖరిని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని సూచించారు. చంద్రబాబు లాంటి నేతలను తీసుకెళ్లి జైలులో పెట్టి రాక్షసానందం పొందుతున్నారని అన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సైతం ఇలాంటి పరిపాలన ఎప్పుడూ చేయలేదని గుర్తు చేశారు. దళిత డ్రైవర్‌ను చంపి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి అప్పగించారని ఆరోపించారు. పులివెందులలో దళిత మహిళపై అత్యాచారం చేసి చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం ఐదేండ్లల్లో బడ్జెట్లో రూ. 7 నుంచి 8 లక్షల కోట్లు ఖర్చు చేసిన పెద్దమనిషి చంద్రబాబు అని కొనియాడారు. ముష్టి రూ. 300 కోట్లకు ఆశపడతారా ? అని ఏపీ ప్రభుత్వాన్ని మోత్కుపల్లి నిలదీశారు.