– నిమజ్జనానికి తరలుతున్న గణనాథులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ నగరంలోని ట్యాంక్‌బండ్ వద్ద వినాయక విగ్రహాల నిమజ్జనం అత్యంత వైభవంగా కొనసాగుతోంది. హుస్సేన్‌సాగర్‌కు తరలుతున్న గణనాథులతో, ప్రజల ఆటపాటలతో నగరం సందడిగా మారిపోయింది. ఆదివారం కావడంతో ఎటుచూసినా కోలాహలమే కనిపించింది. ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, టెలిఫోన్ భవన్, లక్డీకాపూల్, లిబర్టీ, ఆబిడ్స్, హిమాయత్‌నగర్, సికింద్రాబాద్‌తోపాటు పలు ప్రాంతాల్లో సందర్శకుల సందడి నెలకొంది. ఈనెల 18న గణేష్ ఉత్సావలు ప్రారంభం కావడం, మూడు రోజుల నుంచే నిమజ్జనం ప్రక్రియ మొదలు కావడంతో పెద్దఎత్తున విగ్రహాలను ట్యాంక్ బండ్‌కు తీసుకొస్తున్నారు. అలాగే నిమజ్జనాన్ని తిలకించేందుకు సందర్శకులు.. పిల్లాపాపలతో తరలివస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడు కమిషనరేట్ల పోలీస్ అధికారులు ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బందిని అప్రమత్తం చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. గణేషులను తీసుకెళ్లే రహదారులతోపాటు ఘాట్ల వద్ద అదనంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మహిళల భద్రత, ఆకతాయిల ఆటకట్టించేందుకు షీ బృందాలతో ప్రత్యేక నిఘా వేశారు. ఆదివారం హైదరాబాద్ కమిషనరేట్‌లో సీపీ సీవీ ఆనంద్ ట్యాంక్ బండ్‌పై జరుగుతున్న నిమజ్జన ప్రక్రియను పరిశీలించి నిమజ్జన ఏర్పాట్లుపై ఆరా తీశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా క్షేత్రస్తాయిలో సిబ్బందిని అప్రమత్తం చేశారు. భక్తులతో ట్యాంక్ బండ్ కిక్కిరిసిపోవడంతో నిర్వాహకులకు, పోలీస్ సిబ్బందికి పలు సూచనలు, సలహాలను అందించారు. సీపీతో సెంట్రల్‌జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు తదితర అధికారులున్నారు.
ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి పోటెత్తిన సందర్శకులు
ఖైరతాబాద్‌లో కొలువుదీరిన మహాగణపతిని దర్శించుకునేందుకు సందర్శకులు భారీ సంఖలో తలివచ్చారు. ఆదివారం సెలవు కావడంతో భక్తులు ఉదయం నుంచే పిల్లాపాలతో తరలివచ్చారు. దాంతో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్, ట్యాంక్‌బండ్, టెలిఫోన్ భవన్ వైపు నుంచి వచ్చే భక్తుల కోసం నిర్వాహకులు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. క్యూలైన్లలోనే భక్తులను అనుమతిస్తున్నారు. ఈ సారి ఖైరతాబాద్‌లో 63 అడుగుల గణపతిని ఏర్పాటు చేశారు. ఈ నెల 28న ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం జరగనుంది. నిమజ్జనానికి ముందు వీకెండ్ శని, ఆదివారం కావడంతో నగరంతోపాటు వివిధ జిల్లాలు, నగర శివారుప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు.